విశాఖపట్నం: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో తనదైన చమత్కారంతో అందరినీ అలరిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం సెహ్వాగ్ మరోసారి తనదైన శైలిలో సరదా ట్వీట్ పోస్టు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
విశాఖలో ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఐదో వన్డే శనివారం జరగనున్న సంగతి తెలిసిందే. వన్డే మ్యాచ్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు గురువారం ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నాయి. ఇరు జట్ల ఆటగాళ్లు బీచ్ రోడ్డులోని నోవాటెల్ హోటల్లో బస చేస్తున్నారు.

జట్టుతో పాటు టీమిండియా ఛీప్ కోచ్ అనిల్ కుంబ్లే కూడా గురువారమే విశాఖ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్వతహాగా ఫొటోగ్రఫీ అంటే అమితంగా ఇష్టపడే కుంబ్లే తాను బస చేసిన హోటల్ నుంచి కెమెరాతో విశాఖ సముద్ర తీరాన్ని ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఈ పోస్టుకు స్పందించిన సెహ్వాగ్ 'మంచి ఫొటో తీశావు అనిల్ భాయ్. ప్రస్తుతం విశాఖకి కయాంత్ తుపాను ప్రమాదం పొంచి ఉంది కదా.. కామెంటేటర్‌గా నన్ను అక్కడకు రమ్మంటావా..? లేదా ఇంటికి వెళ్లిపొమ్మంటావా..? కాస్త చెప్తావా?' అని ట్వీట్ చేశాడు.
సెహ్వాగ్ ట్వీట్‌కు కుంబ్లే తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. సెహ్వాగ్‌కి దీపావళి శుభాకాంక్షలు చెప్తూనే.. ప్రకృతి విపత్తుని ఎవరూ ఊహించలేమంటూ పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం సెహ్వాగ్ కామెంటేటర్‌గా అభిమానుల్ని అలరిస్తున్న సంగతి తెలిసిందే.