మేమెలా చెప్తాం: సెహ్వాగ్‌పై సెలక్టర్ల తీవ్ర అసహనం
ఢిల్లీ: క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు తనకు సెలక్టర్లు అవకాశం ఇవ్వలేదన్న వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యల పైన సెలక్టర్లు స్పందించారు. సెహ్వాగ్‌కు వారి గట్టి కౌంటర్ ఇచ్చారు. తాము ఏ ఆటగాడినీ కెరీర్‌కు వీడ్కోలు పలకాల్సిందిగా చెప్పమన్నారు.
అదే విధంగా జట్టు ఎంపిక విషయంలో కూడా ఆటగాడికి హామీ ఇవ్వలేమన్నారు. సెలక్టర్లకు ఆ నిర్ణయాధికారం ఉండదని తెలిపారు. తుది జట్టులో స్థానం కోల్పోయినపుడు సదరు ఆటగాడు రంజీ మ్యాచ్‌ల్లో ఆడి ఫామ్‌ను చాటుకోగలిగితే తిరిగి జట్టులో పునరాగమనం చేయవచ్చని గుర్తు చేశారు.
దాదాపు పన్నెండేళ్లకు పైగా భారత క్రికెట్‌కు సేవలందించిన సెహ్వాగ్ తాజా వ్యాఖ్యలు తమను ఆశ్చర్యపరిచాయని సెలక్టర్లు అన్నారు. వీరేంద్ర సెహ్వాగ్ వంటి వ్యక్తి ఇలా మాట్లాడటం అసంతృప్తికి గురి చేసిందన్నారు. ఒక టెస్ట్ ఎందుకని, ఆయన రన్స్ చేస్తే ఎన్నో ఆడవచ్చునని అభిప్రాయపడ్డారు.

డిసెంబరు 3 నుంచి భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఢిల్లీలో ఆరంభం కానున్న నాలుగో టెస్టు మ్యాచ్ సందర్భంగా సెహ్వాగ్‌ని బీసీసీఐ సన్మానించబోతున్నట్లుగా తెలుస్తోంది.
కాగా, భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్‌కు వీడ్కోలు పైన తన మనసులో మాటను ఇటీవల బయటపెట్టిన విషయం తెలిసిందే. ఓ ఛానల్ నిర్వహించే ఆప్ కీ అదాలద్ కార్యక్రమంలో మాట్లాడాడు. ఈ సందర్భంగా రిటైర్మెంట్ పైన తన మనసులోని బాధను బయటపెట్టాడు. ఈ బాధ ఎప్పుడూ ఉంటుందన్నాడు.
మ్యాచ్‌లు ఆడుతూ రిటైరవ్వలేదన్న బాధ తనకు ఎప్పటికీ ఉంటుందని వ్యాఖ్యానించాడు. సెలక్టర్లు తనను తప్పిస్తున్నట్లు చెప్పి ఉంటే, ఢిల్లీలో తన వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వమని అడిగేవాణ్ణని, రిటైర్మెంట్ ప్రకటించేవాణ్ని అన్నాడు. కానీ తనకు ఆ అవకాశం ఇవ్వలేదన్నాడు.
మ్యాచ్‌లు ఆడుతూ రిటైరయ్యే అవకాశం దక్కకపోతే ఎలాంటి ఆటగాడికైనా బాధ ఉంటుందన్నాడు. ఐతే ఆటలో ఉండగా ఎప్పుడు రిటైరవ్వాలన్నది ఏ ఆటగాడూ తేల్చుకోలేడని చెప్పాడు. వేటు పడ్డాకే రిటైర్మెంట్ ఆలోచన వస్తుందన్నాడు.
పదమూడేళ్ల పాటు దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఆటగాడికి వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వరా అని అడుగుతున్నానని సెలక్టర్లను ప్రశ్నించాడు. అసలు తనను జట్టులోంచి తొలగించే వరకు రిటైర్మెంట్ ఆలోచన రాలేదన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications