న్యూఢిల్లీ: విమర్శలకు తన బ్యాట్‌తోనే మైదానంలో సమాధానం చెప్పే భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మాటలతోనూ ఘాటుగానే సమాధానాలు చెబుతున్నారు. రిటైర్మెంట్ తర్వాత ట్విట్టర్‌లో చురుగ్గా ఉంటున్న వీరేంద్ర సెహ్వాగ్.. ఇటీవల కాలంలో స్ఫూర్తిదాయక సందేశాలను పోస్టు చేస్తున్నారు.
తాజాగా, భారత్‌ను విమర్శించిన ఓ విదేశీ జర్నలిస్టుకి చెంప ఛెళ్లుమనింపిచేలా సమాధానమిచ్చి భారతీయులందరితో శభాష్ అనిపించారు. '125 కోట్ల మంది జనాభా ఉన్నా.. కేవలం రెండు పతకాలు సాధించి దానికే సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు' అంటూ బ్రిటీష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ వ్యాఖ్యానించాడు. దీనికి ట్విట్టర్ ద్వారానే సెహ్వాగ్ ఘాటుగా జవాబు ఇచ్చారు.

ముందుగా మోర్గాన్ చేసిన ట్వీట్‌కు సమాధానంగా.. 'భారతీయులు ప్రతి చిన్న విషయానికీ ఆనందిస్తూనే ఉంటారు' అని సెహ్వాగ్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత 'అది సరేగానీ, క్రికెట్‌ను కనుగొన్నది తామేనంటూ జబ్బలు చరుచుకునే ఇంగ్లాండ్ ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలవలేదు. అయినా ఇప్పటికీ ప్రపంచకప్‌లో ఆడుతూనే ఉండటం ఇబ్బందికరంగా ఏమీ లేదా' అని మోర్గాన్ చెంప ఛెళ్లుమనిపించేలా మరో ట్వీట్ చేశారు సెహ్వాగ్.
దీంతో ఒక్కసారిగా సెహ్వాగ్ సమాధానానికి ట్విట్టర్‌లో లైక్స్ భారీగా పెరిగిపోయాయి. అంతేగాక, అలాంటి వారికి సరైన సమాధానం ఇచ్చావంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. కొన్ని గంటల్లోనే వేల సంఖ్యలో రీట్వీట్లు, దానికి మించి లైకుల వర్షం కురుస్తూనే ఉంది.
అయితే అది అక్కడితో ఆగలేదు. సెహ్వాగ్ ట్వీట్‌కు మోర్గాన్ మరోసారి స్పందించాడు. కెవిన్ పీటర్సన్ ఆడి ఉంటే, ఇంగ్లాండ్ తప్పనిసరిగా ప్రపంచకప్ గెలిచేదని చెప్పాడు. కానీ, హనుమంతుడి ముందు కుప్పగంతులా అన్నట్లు క్రికట్ గురించి సెహ్వాగ్‌కు చెబితే ఎలా? అందుకే వీరూ దానికి కూడా గట్టిగానే చెప్పాడు.
అసలు పీటర్సన్ ఇంగ్లాండ్ వ్యక్తి కాదని, దక్షిణాఫ్రికాలో పుట్టాడని, అందులోనూ ఆయన 2007 ప్రపంచకప్‌లో ఆడాడని.. అయినా ఇంగ్లండ్ ఓడిపోయిందని చకచకా చెప్పేశాడు. దాంతో ఇక మోర్గాన్ మాట్లాడేందుకు ఏమీ లేక నోరు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెటిజన్లు సైతం ఆ జర్నలిస్టును ఏకిపారేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, 'రియో ఒలింపిక్స్‌లో భారత్‌దే అత్యంత చెత్త ప్రదర్శన' అని ఓ న్యూజిల్యాండ్ దినపత్రిక నోరు పారేసుకోవడం గమనార్హం. మరోవైపు 'ఒలింపిక్స్ ఇండియా వరెస్ట్ కంట్రీ' అనే శీర్షికతో న్యూజిలాండ్ హెరాల్డ్ పత్రిక ఓ కథనాన్ని వండివార్చింది.
భారత్ రెండు మెడల్స్ సాధించి పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచిందని, జనాభా, జీడీపీ ప్రకారం చూసుకుంటే.. ఒలింపిక్స్‌లో పాల్గొన్న అన్ని దేశాల కంటే ఇదే చెత్త ప్రదర్శన అని పేర్కొంది. ఇక ఒక్క పతకం కూడా గెలువకుండా ఇంటిముఖం పట్టిన మన దాయాది పాకిస్థాన్‌ను అసలు లెక్కలోకే రాదంటూ ఈ పత్రిక విమర్శలు వర్షం కురిపించింది. కాగా, ఇదంతా పాశ్చాత్య దేశాల పైత్యానికి నిదర్శనమంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.