రాజ్‌కోట్: బీసీసీఐ భారత్ జట్టుకు అందించిన అత్యుత్తమ ఓపెనింగ్ జోడీల్లో వీరేంద్ర సెహ్వాగ్-గౌతం గంభీర్ జోడీ ఒకటి. వీరిద్దరూ కలిసి టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు. అంతేకాదు వీరిద్దరూ కలిసి ఎన్నో అత్యుత్తమ భాగస్వామ్యాలను కూడా నెలకొల్పారు.
స్వదేశంలోనే కాకుండా విదేశీ పిచ్‌లపై ఈ జోడీ ఎన్నో రికార్డులను నమోదు చేసింది. ముఖ్యంగా గంభీర్ ఎడమచేతి వాటం, సెహ్వాగ్ కుడి చేతి వాటం కావడంతో ప్రత్యర్ధి జట్లు ఎంతగానో ఇబ్బంది పడేవి. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ సందర్భంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రాజ్‌కోట్‌లో తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీరేంద్ర సెహ్వాగ్ వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఒకప్పటి తన ఓపెనింగ్ భాగస్వామి గౌతం గంభీర్ తొలి టెస్టులో మూడో రోజు బ్యాటింగ్ చేస్తుండగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

గంభీర్‌తో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో గౌతీ ఏది తింటే తనను కూడా అదే తినమనే వాడని గర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా తాను 90 పరుగులు చేసిన తర్వాత ఇలా ప్రతిపాదించేవాడని చెప్పాడు. కానీ తాను ఒకటే ఆహారం తీసుకోవడంతో విసుగు చెందేవాడినని నవ్వుతూ అన్నాడు.
అప్పట్లో తామిద్దరం కలిసి చాలా మూఢ నమ్మకాలను పాటించేవారమని, ఆ నేరంలో ఇద్దరం భాగస్వాములమేనని సెహ్వాగ్ సరదాగా వ్యాఖ్యానించారు. టెస్టుల్లో వీరిద్దరి భాగస్వామ్య యావరేజి 53గా ఉంది. ఈ యావరేజి ప్రపంచ ఉత్తమ గణాంకాల్లో ఒకటి. కాగా, రాజ్ కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో గంభీర్ 29 పరుగుల వద్ద స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.