దుబాయ్:తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లు వచ్చిన వార్తలను వీరేంద్ర సెహ్వాగ్ ఖండించాడు. సమాచార లోపం వల్లనే మీడియా పొరపడిందని ఆయన చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు తాను వీడ్కోలు పలికినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పాడు. ఆ వార్తలు అధికారికంగా వెల్లడించినవి కావని, సమాచార లోపం వల్ల పుట్టుకొచ్చినవని అన్నాడు.
ప్రస్తుతం దుబాయ్‌లో మాస్టర్స్ క్రికెట్ లీగ్ ప్రారంభంలో పాల్గొన్న సెహ్వాగ్ - ఈ సిరీస్ పూర్తయిన తర్వాత రిటైర్మెంట్‌పై ఓ నిర్ణయానికి వస్తానని మాత్రమే తాను చెప్పానని, అది కూడా అతి మామూలు ధోరణిలో అన్నానని ఆయన వివరించాడు. రిటైర్ అయిన ఆటగాళ్లు ఆడే ఎంసిఎల్ ఆడుతానని ఆయన చెప్పాడు.
రిటైర్ అయిన ఆటగాళ్లు ఆడే మాస్టర్స్ క్రికెట్ లీగ్ (ఎంసిఎల్) ఎలా ఆడుతారని అడిగితే తాను రిటైర్ కాకపోతే ఆడబోనని, భారత్ వెళ్లి తన రిటైర్మెంట్ గురించి ప్రకటిస్తానని సెహ్వాగ్ చెప్పాడు. ఎంసిఎల్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. అందువల్ల సెహ్వాగ్ ఆ లోపల రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. వెటరన్స్ లీగ్ అడడానికి ముందు హర్యానా తరఫున రంజీ ట్రోఫీని ఆడుతాడని అర్థమవుతోంది.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రకటించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. గత రెండున్నరేళ్లుగా అతను భారత జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అతను అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో 17,253 పరుగులు చేశాడు. టెస్టు మ్యాచుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన భారత ఏకైక బ్యాట్స్‌మన్ సెహ్వాగ్. అతను రెండు సార్లు ట్రిపుల్ సెంచరీ సాధించాడు. దుబాయ్‌లో తన రిటైర్మెంట్ విషయాన్ని సెహ్వాగ్ ప్రకటించాడని టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి. ఐపిఎల్‌లో మాత్రం కొనసాగుతానని చెప్పినట్లు కూడా మీడియా ప్రచారం చేసింది.
సెహ్వాగ్ 104 టెస్టులు ఆడి 8586 పరుగులు చేశాడు. ఆల్ టైమ్ లిస్టులో అతను ఐదో స్థానంలో నిలిచాడు. వన్డే మ్యాచుల్లో అతను 8273 పరుగులు చేశాడు. 15 సెంచరీలు సాధించాడు. 219 పరుగులతో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దానికి తోడు, టెస్టుల్లో 40 వికెట్లు, వన్డేల్లో 96 వికెట్లు తీశాడు.

వన్డేల్లో 1999లో అతను అడుగుపెట్టాడు. తొలుత పరిమిత ఓవర్ల ఆటగాడిగానే గుర్తింపు పొందిన సెహ్వాగ్ తర్వాతి కాలంలో టెస్టుల్లో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా ఆవతారమెత్తి, దానికి సరికొత్త ఒరవడిని పెట్టాడు. టెస్టుల్లో తొలుత ఆరోస్థానంలో బ్యాటింగ్ దిగేవాడు.
2003 - 04 సంవత్సరం అతనికి స్వర్ణయుగం. ముంబై (రెండుసార్లు), గాలే, కాన్పూర్, కోల్‌కతా, కొలంబో, అహ్మదాబాద్‌ల్లో అతను మ్యాచ్ విన్నింగ్ సెంచరీలు సాధించాడు. అతను చివరగా 2013 మార్చిలో ఆస్ట్రేలియాపై హైదరాబాద్‌లో టెస్టు మ్యాచ్ ఆడాడు. చివరి వన్డే 2013 జనవరిలో పాకిస్తాన్‌పై
ఆడాడు. ట్వంటీ20 జట్టులో 2012లో స్థానం కోల్పోయాడు.