తదుపరి కోచ్ ఎవరన్న ప్రకటన వాయిదా: అసలేం జరిగింది?
హైదరాబాద్: 'జులై 10న టీమిండియా కొత్త కోచ్ పదవికి ఇంటర్యూలు, అదే రోజు కొత్త కోచ్ పేరుని ప్రకటిస్తాం' కొన్ని రోజుల కిందట బీసీసీఐ చెప్పిన మాటలివి. చెప్పిన దాని ప్రకారమే సోమవారం కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూలు చేసింది.
సోమవారం బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న సీఏసీ సభ్యులలో ఒకడైన సౌరవ్ గంగూలీ సాయంత్రానికి కొత్త కోచ్ ఎవరో ప్రకటిస్తామంటూ ఇంటర్వ్యూకి ముందు మీడియాతో చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. భారత జట్టుకి కాబోయే తదుపరి కోచ్ ఎవరన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే సాయంత్రం సౌరవ్ గంగూలీ మీడియా సమావేశంలో కొత్త కోచ్ ఎవరన్న ఉత్సాహాన్ని నీరుగార్చారు. కొత్త కోచ్ ఎంపికపై అప్పుడే తొందర ఏమీ లేదని, కోహ్లీతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. కొత్త కోచ్‌గా ఎవరిని ఎంపిక చేసినా వారు 2019 వరల్డ్ కప్ వరకు కొనసాగుతారని గంగూలీ స్పష్టం చేశాడు.
అయితే కొత్త కోచ్ కథలో ఈ మలుపేమిటో... కొన్ని గంటల వ్యవధిలోనే కోచ్ పేరు ప్రకటిస్తామని చెప్పిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఆ విధంగా నిర్ణయం ఎందుకు తీసుకుందోనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు ఈ మార్పుకు గల కారణాలపై పెద్ద చర్చ జరుగుతోంది.

కుంబ్లే ఉదంతం వల్లే ఇలా జరిగిందా?
కుంబ్లే ఉదంతం వల్లే ఇలా జరిగిందా? అని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2017లో అనిల్ కుంబ్లేని టీమిండియా కోచ్ పదవికి ఎంపిక చేసింది సీఏసీనే. అప్పట్లో కెప్టెన్ కోహ్లీని సంప్రదించకుండానే అనిల్ కుంబ్లేను ఇలాగే కోచ్‌గా ఎంపిక చేసింది. అయితే కుంబ్లే విషయంలో కమిటీ, బీసీసీఐ, అభిమానులు పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. కుంబ్లే, కోహ్లీల మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయి. అతి కష్టం మీద ఏడాది కోచ్‌గా కొనసాగిన అనిల్ కుంబ్లే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం కోచ్ పదవికి రాజీనామా చేశాడు.

సీఏసీకి కాస్తంత ఇబ్బందికర పరిణామమే
ఇది నిజంగా సీఏసీకి కాస్తంత ఇబ్బందికర పరిణామమే. అప్పట్లో రవిశాస్త్రిని కాదని, కుంబ్లేను ఎంపిక చేసి.. జట్టు మీద రుద్దిందన్న విమర్శలూ కూడా సీఏసీ ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీని సంప్రదించకుండా కోచ్ ఎంపికపై నిర్ణయం తీసుకోకూడదనే భావించి ఉండొచ్చని అంటున్నారు. మరోవైపు సీఏఈ కోచ్‌గా ఎవరిని ఎంపిక చేసినప్పటికీ.. ఆ వ్యక్తికి రాబోయే కాలంలో కోహ్లీతో పని చేయాల్సి ఉంటుంది. టీమిండియా కూడా రాబోయే రోజుల్లో వరుసగా విదేశీ పర్యటనలకు వెళ్లనుంది.

ఏకపక్ష నిర్ణయం ఉండకూడదనే
ఈ నేపథ్యంలో టీమిండియా ఆడే మ్యాచ్‌ల్లో ప్రతికూల ఫలితాలే వస్తే.. కోచ్ మీదా అందరి దృష్టి పడుతుంది. కోచ్ విఫలమయ్యాడన్న భావన కలిగితే సీఏసీ కూడా అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీంతో ఏకపక్షంగా తమ నిర్ణయాన్ని ప్రకటించకుండా కోచ్ ఎంపిక విషయంలో కోహ్లీని కూడా భాగస్వామిని చేసి ఉండొచ్చు.

రవిశాస్త్రికి కష్టమే!
మరోవైపు కోచ్ ఎవరో ప్రకటించడానికి తొందర ఏమీ లేదని వాయిదా వేయడం, కోహ్లీతో మాట్లాడాకే కోచ్ పేరుని ప్రకటిస్తామని గంగూలీ వ్యాఖ్యానించడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. ఇవన్నీ చూస్తే అసలు సీఏసీ కోచ్‌గా ఎంచుకున్న వ్యక్తి ఎవరన్నదానిపై ఉత్కంఠ మొదలైంది. మరోవైపు బీసీసీఐలోని ఒక వర్గం చెబుతున్న ప్రకారం... కోహ్లీ ముందు సీఏసీ రెండు ప్రత్యామ్నాయాలు ఉంచి అందులో ఒకరిని ఎంపిక చేసుకోమని కోరుతున్నట్లు సమాచారం. అయితే అందులో శాస్త్రి పేరు కాకుండా సెహ్వాగ్, టామ్ మూడీ పేర్లు ఉన్నాయని అంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications