ప్రపంచ క్రికెట్‌లో చాలా మంది మిడిలార్డర్ బ్యాటర్లు పలు రికార్డులు బద్దలు కొట్టారు. అదే ఇంతకుముందు తరంలో చూస్తే టీమిండియా లెజెండ్స్ రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ వంటి వారు కూడా మిడిలార్డర్‌లో ఆడిన వారే. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇన్నింగ్స్ చక్కిదిద్దే బాధ్యత వీళ్లపై ఉంటుంది.
ఈ క్రమంలోనే ఆ తరంలో బెస్ట్ మిడిలార్డర్ బ్యాటర్ ఎవరు? అని చాలా మంది చర్చిస్తుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ విషయంపై స్పందించాడు. తన తరంలో బెస్ట్ మిడిలార్డర్ బ్యాటర్ ఎవరో చెప్పిన సెహ్వాగ్.. సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్ వంటి వారికి షాకిచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో ఆసియాలోనే బెస్ట్ మిడిలార్డర్ బ్యాటర్ ఎవరు? అని సెహ్వాగ్‌ను అడిగారు.

దీనికి సమాధానం ఇచ్చిన సెహ్వాగ్.. పాకిస్తాన్ మాజీ సారధి ఇంజమామ్ ఉల్ హక్ పేరు చెప్పాడు. అందరూ సచిన్ గురించే మాట్లాడతారని, కానీ ఇంజీ భాయ్ కూడా అద్భుతమైన బ్యాటర్ అని చెప్పాడు. కఠినమైన పరిస్థితుల్లో కూడా ఇంజమామ్ ప్రశాంతంగా ఉండేవాడని, ఎంత ఒత్తిడి ఉన్నా ఆడేందుకు ఇబ్బంది పడేవాడని చెప్పాడు. 'ఇంజీ భాయ్ చాలా మంచివాడు. అందరూ సచిన్ గురించే మాట్లాడతారు. కానీ నా దృష్టిలో ఆసియాలో బెస్ట్ మిడిలార్డర్ బ్యాటర్ ఇంజామామే' అన్నాడు.
'నన్నడిగితే సచిన్‌ను బ్యాటర్లతో పోల్చడం కరెక్ట్ కాదు. కాబట్టి అతన్ని ఈ లిస్టులో తీసేయాలి. కనీసం మనుషుల్లో కూడా సచిన్‌ను లెక్కేయకూడదు. ఇక ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఏ దేశం బ్యాటర్ అయినా సరే.. ఇంజమామ్ కన్నా బెటర్ బ్యాటర్‌ను నేను చూడలేదు. అప్పట్లో 2003-04 సమయంలో ఓవర్‌కు 8 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు కూడా.. ఏం పర్లేదు ఈజీగా చేసేస్తాం అనేవాడు ఇంజీ భాయ్. అప్పట్లో పది ఓవర్లలో 80 రన్స్ చేయాలంటే ఏ జట్టు అయినా టెన్షన్ పడిపోతుంది. తను మాత్రం.. టెన్షన్ వద్దు, ఈజీగా చేసేద్దాం అనేవాడు' అని సెహ్వాగ్ గుర్తుచేసుకున్నాడు.
పాకిస్తాన్ క్రికెట్‌లో బెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా పేరొందిన ఇంజమామ్ ఉల్ హక్ 1991లో ఆ దేశం తరఫున అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి సంవత్సరం వన్డే వరల్డ్ కప్ నెగ్గిన పాక్ జట్టులో కీలకపాత్ర పోషించాడు. తన దేశం తరఫున 378 వన్డేలు, 120 టెస్టులు ఆడిన అతను.. వన్డేల్లో 11,739 పరుగులు, టెస్టుల్లో 8830 పరుగులు చేశాడు.