హైదరాబాద్: వీరేంద్ర సెహ్వాగ్... అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ట్విట్టర్‌లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ముఖ్యంగా ట్విట్టర్‌లో తనదైన శైలిలో చురుగ్గా ఉంటూ అభిమానుల్ని సైతం అలరిస్తున్నాడు. ప్రధాని మోడీ నుంచి అరంగేట్ర క్రికెటర్ వరకూ అందరి ప్రముఖుల పుట్టిన రోజులను గుర్తు పెట్టుకుని తనదైన శైలిలో ట్విట్టర్‌లో వారికి శుభాకాంక్షలు చెప్పడం సెహ్వాగ్ ప్రత్యేకత.
అభిమానులు సైతం సెహ్వాగ్ చేసే చమత్కారపు ట్వీట్ల కోసం ఎదురు చూస్తుంటారంటే అతిశయోక్తి కాదేమో. టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతం గంభీర్ తన పుట్టినరోజు నాడు సెహ్వాగ్ తన దైన శైలిలో ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పలేదని అలిగిన సందర్భాన్ని కూడా గతంలో మనం చూశాం.
దీనిని బట్టి సెహ్వాగ్ ఎంతలా హాస్య చతురతను జోడిస్తాడో మీరే అర్ధం చేసుకోండి. తాజాగా సెహ్వాగ్ ట్విటర్ ఫాలోయర్లు కోటికి చేరారు. ఈ సందర్భంగా చేసిన పోస్ట్‌లో కూడా సెహ్వాగ్ తన హాస్య చతురతను జోడించడం విశేషం.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ పదో సీజన్‌లో పంజాబ్ జట్టుకి సెహ్వాగ్ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా పని చేశాడు. గత ఏడాది పేలవ ప్రదర్శనతో ఎనిమిదో స్థానానికి పరిమితమైన ఆ జట్టు ఈ ఏడాది అనూహ్యంగా ప్లేఆఫ్ రేసులోకి దూసుకొచ్చేలా కనిపించింది.
కానీ.. లీగ్ చివరి మ్యాచ్‌లో రైజింగ్ పూణె చేతిలో ఓటమిపాలై ఐదో స్థానానికే పరిమితమైంది. అంతేకాదు ఈ సీజన్‌లో పంజాబ్ జట్టు పలు రికార్డులను కూడా నమోదు చేసింది. పంజాబ్ జట్టు ఓపెనర్ హసీమ్ ఆమ్లా రెండు సెంచరీలు నమోదు చేశాడు. పదో సీజన్లో మొత్తం 705 సిక్సర్లు నమోదయ్యాయి.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 88 సిక్సర్లతో రెండో స్ధానంలో నిలవగా, ఆటగాళ్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 26 సిక్సర్లు బాది తొలి స్థానంలో నిలిచారు.