టీమిండియా లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే రకం. అవతలి వ్యక్తి ఎవరైనా సరే నిర్మొహమాటంగా తన అభిప్రాయం చెప్పడం సెహ్వాగ్ అలవాటు. ఈ క్రమంలోనే ఫామ్‌లో లేనప్పుడు కోహ్లీపై కూడా తెగ జోకులు పేల్చాడు. ఈ క్రమంలో తాజాగా ఈ లెజెండరీ ఓపెనర్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఈసారి సెహ్వాగ్ కొత్త కుర్రాళ్లను టార్గెట్ చేశాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్, తాజాగా ఫామ్‌లోకి వచ్చిన పృథ్వీ షాపై మండిపడ్డాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో పృథ్వీ షా చాలా చెత్త ఫామ్ కనబరిచిన సంగతి తెలిసిందే. తొలి ఆరు మ్యాచుల్లో అతను చాలా పేలవంగా ఆడాడు. దీంతో అతన్ని జట్టులో నుంచి ఢిల్లీ యాజమాన్యం పక్కన పెట్టేసింది.

తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ జట్టులోకి వచ్చిన పృథ్వీ షా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత తన అర్ధశతకాన్ని షా సెలబ్రేట్ చేసుకున్న విధానంపై చాలా మంది విమర్శలు గుప్పించారు. సీజన్ ఆరంభం నుంచి ఫెయిలైన అతను.. చివరి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి ఇంత షో చేయడం చూస్తుంటే నవ్వొస్తోందని చాలా మంది ఫ్యాన్స్ ఎగతాళి చేశారు.
ఇలాంటి సమయంలో సెహ్వాగ్ చేసిన కామెంట్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. 'పృథ్వీ షా నాతో కలిసి ఒక యాడ్ చేశాడు. అప్పుడు శుభ్‌మన్ గిల్ కూడా మాతో ఉన్నాడు. మేం అక్కడ ఆరు గంటలు కలిసి ఉన్నాం. కానీ వాళ్లిద్దరిలో ఎవరూ కూడా నాతో క్రికెట్ గురించి ఏం మాట్లాడలేదు. మనం ఎవరితో అయినా మాట్లాడాలంటే మనమే వెళ్లాలి. అంతేకానీ, వాళ్లు వచ్చి మనతో మాట్లాడరు' అని విమర్శించాడీ లెజెండరీ ఓపెనర్.
ఈ క్రమంలో తన అనుభవాన్ని కూడా వివరించాడు. తను కొత్తగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టినప్పుడు తను సునీల్ గవాస్కర్‌ను కలిసేందుకు ఎంతో కష్టపడ్డానని చెప్పాడు. అంతేకానీ, గవాస్కర్ వచ్చి తనను కలవలేదన్నాడు. ఈ క్రమంలో గవాస్కర్‌ను కలవడానికి తాను ఏం చేశాడో సెహ్వాగ్ వివరించాడు. ప్రస్తుతం కుర్రాళ్లు కూడా అలాగే ఉంటే మంచిదని సూచించాడు.
'నేను టీలోకి కొత్తగా వచ్చినప్పుడు సన్నీ భాయ్‌తో మాట్లాడాలని అనుకున్నా. దాని కోసం జాన్ రైట్‌ను కలిశాం. నేను ఇంకా కొత్త కుర్రాడిని, మరి సన్నీ భాయ్ నన్ను కలుస్తాడా? అని అనుమానం ఉంది. అదే విషయం అతనికి చెప్పా. అదే సమయంలో ఎలాగైనా సరే సన్నీ భాయ్‌తో డిన్నర్ ఏర్పాటు చేయాలని అడిగా. ఈ క్రమంలోనే 2003-2004 సయమంలో నాకు ఆ అవకాశం వచ్చింది' అని సెహ్వాగ్ గుర్తుచేసుకున్నాడు.
ఈ డిన్నర్‌కు అప్పట్లో తన ఓపెనింగ్ పార్టనర్ ఆకాష్ చోప్రా కూడా వస్తాడని చెప్పానని, తాము ముగ్గురం కూర్చొని క్రికెట్ గురించి మాట్లాడుకున్నామని చెప్పాడు. 'ఆ డిన్నర్ సమయంలో బ్యాటింగ్ గురించి మాట్లాడాలని అనుకున్నాం. సన్నీ భాయ్ ఆ డిన్నర్‌కు వచ్చాడు. అంటే, మనమే సీనియర్లను కలవడానికి ప్రయత్నించాలి. సెహ్వాగ్, చోప్రాలను కలవడానికి సునీల్ గవాస్కర్ ప్రయత్నించడం జరగదు. మనమే ఆ ప్రయత్నం చేయాలి' అని సెహ్వాగ్ విమర్శలు చేశాడు.