
ఇష్యూ ఏంటంటే?
ముంబైలోని వాంఖడే స్టేడియంలో సాంకేతిక సమస్యల వల్ల చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ టాస్ ఆలస్యమైంది. ఫ్లడ్ లైట్స్ వెలగకపోవడంతో దాదాపు 5నిమిషాల కెప్టెన్లు ఎదురుచూడాల్సొచ్చింది. చివరకు పవర్ కట్ వల్ల డీఆర్ఎస్లు లేకుండానే మ్యాచ్ మొదలైంది. ఇక తొలి ఓవర్ డానియల్ సామ్స్ వేయగా.. ఆ ఓవర్ రెండో బంతికే డెవాన్ కాన్వేని అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ఔటిచ్చాడు.
ఆ బంతి వికెట్లకు లెగ్ సైడ్ వెళ్తున్నట్లు కన్పించింది. కానీ రివ్యూ తీసుకునే వీలు లేకపోవడంతో కాన్వే నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. రెండో ఓవర్ నాలుగో బంతికి రాబిన్ ఊతప్ప సైతం ఎల్బీడబ్ల్యూ ఔట్ కాగా అప్పుడు కూడా డీఆర్ఎస్ తీసుకోలేకపోయారు. రెండో ఓవర్ తర్వాత రివ్యూలు అందుబాటులోకి వచ్చాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం చెన్నైకి జరిగిపోయింది.

జనరేటర్‌ను కూడా ఉపయోగించలేరా?
ఈ వివాదంపై సెహ్వాగ్ స్పందిస్తూ.. మ్యాచ్‌లో పవర్ కట్ వల్ల డీఆర్ఎస్ అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద లీగ్‌లో ఒక జనరేటర్‌ను కూడా ఉపయోగించలేరా..? డీఆర్ఎస్ సాఫ్ట్వేర్ కోసం జనరేటర్ ద్వారా పవర్ బ్యాకప్ పెట్టుకోలేరా? జనరేటర్లను ఉపయోగించకపోవడమేంటో అర్థం కావట్లేదు. ఐపీఎల్ నిర్వహణలో ఇలా వ్యవహరించడం పట్ల బీసీసీఐకి ఇది పెద్ద ప్రశ్న రేకెత్తించిందంటూ సెహ్వాగ్ క్రిక్‌బజ్‌లో పేర్కొన్నాడు.

వాడితే మొత్తం వాడాలి లేకుంటే లేదు
పవర్ కట్ అయినంతా మాత్రానా మ్యాచ్ జరగలేదా.. స్టేడియం లైట్లు వెలగలేవా, బ్రాడ్కాస్టర్లకు ప్రసారాలు జరగలేవా, వీటన్నింటికీ లేని పవర్ సమస్య కేవలం డీఆర్ఎస్కు మాత్రమే పవర్ ఇష్యూ ఏంటీ..? మ్యాచ్ జరుగుతుంటే కచ్చితంగా డీఆర్ఎస్ వాడాలి.. లేదంటే ఆ మ్యాచ్ మొత్తం డీఆర్ఎస్ వాడకూడదు. ఇది నిజంగా చెన్నైకి వ్యతిరేకమైనది. ఒకవేళ ముంబై మొదట బ్యాటింగ్ చేస్తే అప్పుడు వారు నష్టపోయేవారు అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.