న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 9వ ఎడిషన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. గత రెండు సీజన్లలో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.
పంజాబ్ జట్టు చీఫ్ కోట్ సంజయ్ బంగర్‌తో కలిసి సెహ్వాగ్ జట్టుకు సేవలందించనున్నట్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ సలహాలు, సూచనలతో పంజాబ్ జట్టుకు తప్పకుండా లాభం చేకూరుతుందన్నారు.

ఈ విషయంపై సెహ్వాగ్ మాట్లాడుతూ పంజాబ్ జట్టు మెంటార్‌గా కొనసాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పంజాబ్ జట్టులో ఆడిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. తాను చేపట్టబోయే కొత్త రోల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.
2007లో టి20, 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలుచుకున్న భారత జట్టులో వీరేంద్ర సెహ్వాగ్ సభ్యుడిగా ఉన్నారు. తన అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ జట్టుకు అద్భుతమైన విషయాలను అందించాడు. అంతేకాదు భారత జట్టు తరుపున రెండు 'ట్రిపుల్ సెంచరీలు' చేసిన ఏకైక భారత ఆటగాడు. వన్డేల్లో 'డబుల్ సెంచరీ' సాధించిన ఐదుగురు ఆటగాళ్లలో సెహ్వాగ్ ఒకడు.