న్యూఢిల్లీ: శనివారం జరిగిన కబడ్డీ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. భారత్ కబడ్డీ వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ ట్విట్టర్‌లో దూకుడును ప్రదర్శించాడు. ఇటీవల కాలంలో సెహ్వాగ్ ట్విట్టర్‌లో తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
రియో ఒలింపిక్స్ అనంతరం భారత్‌ను కించపరిచిన బ్రిటీష్ జర్నలిస్ట్ పీర్స్ మోర్గాన్ టార్గెట్ చేస్తూ శనివారం సెహ్వాగ్ మరోసారి మాటల యుద్ధానికి తెరదీశాడు. తమ దేశంలో పుట్టిన కబడ్డీలో తిరుగులేని జైత్రయాత్ర కొనసాగిస్తూ మేము ఎనిమిది సార్లు వరల్డ్ చాంపియన్స్‌గా (పురుషులు, మహిళల జట్లు) నిలవగా.. క్రికెట్ పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ మాత్రం టైపింగ్ తప్పులను సరిచేస్తూనే ఉందని ట్వీట్ చేశాడు.
సెహ్వాగ్ చేసిన ఈ ట్వీట్‌ను 24,661 మంది రీట్వీట్ చేయగా, 39,998 మంది లైక్ చేశారు. రియో ఒలింపిక్స్ సందర్భంగా 125 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ రియో ఒలింపిక్స్‌లో కేవలం రెండు పతకాలు సాధించినదానికే సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారంటూ ప్రముఖ బ్రిటీష్ జర్నలిస్ట్ పీర్స్ మోర్గాన్ వ్యాఖ్యానించారు.
కబడ్డీ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా మంగళవారం (అక్టోబర్ 18) రాత్రి భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య జరిగిన పోరులో భారత్ 69-18తో ఇంగ్లాండ్‌పై భారీ విజయం సాధించింది. ఈ విజయంతో వరుసగా మూడు విజయాలను సొంతం చేసుకున్న భారత జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సెమీస్‌లోకి అడుగుపెట్టింది.
ఈ సందర్భంగా సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో 'వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ మళ్లీ ఓటమి (loose) పాలైంది. స్పాట్ మాత్రమే మారింది. ఈసారి కబడ్డీ. 69-18తో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం సాధించింది. భారత్‌కు ఆల్ ద బెస్ట్' అంటూ ట్వీట్ చేశాఢు.
సెహ్వాగ్ ట్వీట్‌కు పీర్స్ మోర్గాన్ వెంటనే స్పందించాడు. తన ట్వీట్‌లో స్పెల్లింగ్ తప్పి ఉందంటూ అది loose కాదు lose అంటూ ట్వీట్ చేశాడు.
రియో ఒలింపిక్స్ 2016లో పతకాల విషయంలో పీర్స్ మోర్గాన్ వెటకారం చేయగా, వీరేంద్ర సెహ్వాగ్ గట్టి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండు పతకాలు గెలిచిన భారత్ ఇంత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటుందా అని పీర్స్ మోర్గాన్ ట్వీట్ చేశాడు.

దీనిపై స్పందించిన సెహ్వాగ్.. దానికి సమాధానంగా సెహ్వాగ్ మేం చిన్ని చిన్ని సంతోషాలను కూడా గొప్పగా జరుపుకొంటామని, కానీ క్రికెట్‌ను కనిపెట్టిన ఇంగ్లాండ్ ఇప్పటికీ ప్రపంచ కప్ నెగ్గలేకపోయిందని, అయితే ఇంకా ఆ దేశం క్రికెట్ ఆడుతుండటం సిగ్గుచేటు కదా అని రీట్వీట్ చేశాడు.
ఆ తర్వాత, పియర్స్ మోర్గాన్.. నేను రూ.10లక్షలు పందెం కాస్తానని, భారతదేశం మరో ఒలింపిక్ స్వర్ణం గెలిచేలోపు ఇంగ్లాండ్ ప్రపంచకప్ నెగ్గుతుందని, సవాల్‌కు సిద్ధమేనా అని ట్వీట్ చేశాడు. దానికి సెహ్వాగ్ మాత్రం తనదైన శైలిలో కొందరిని దురదృష్టం మళ్లీ మళ్లీ వెంటాడుతూనే ఉంటుందని, వాళ్లు ఎంత ప్రయత్నించినా లాభం లేదంటూ.. హాహాహా.. అంటూ నవ్వులు కురిపించాడు.
ఆ తర్వాత పారాలింపిక్స్‌లో అంచనాల్లేకుండా బరిలోకి దిగిన 21ఏళ్ల మారియప్పన్ తంగవేలు హైజంప్ విభాగంలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. అయితే మళ్లీ సెహ్వాగ్ విమర్శలు కురిపించడంతో మోర్గాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.