
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2022, 15వ ఎడిషన్ మెగా వేలంపాటకు రంగం సిద్ధమైంది. ఇంకొన్ని గంటలే మిగిలివుంది. ఈ టోర్నమెంట్‌లో ఆడబోయే క్రికెటర్ల కోసం మెగా వేలంపాట ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానుంది. ఆదివారం కూడా కొనసాగుతుంది. బెంగళూరు- ఈ మెగా ఆక్షన్‌కు ఆతిథ్యాన్ని ఇచ్చింది. హోటల్ ఐటీసీ గార్డెనియాలో ఈ వేలం పాటను నిర్వహించనున్నారు.
ఈ దఫా ఈ వేలంపాటలో 10 ఫ్రాంఛైజీలు పాల్గొనబోతోన్నాయి. క్రికెటర్ల పంట పండించనున్నాయి. ఐపీఎల్ 2022 మెగా టోర్నమెంట్‌లో పాల్గొనే ఫ్రాంఛైజీల సంఖ్య పెరిగిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా జాయిన్ అయ్యాయి. పాత ఫ్రాంఛైజీలు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలానికి హాజరు కానున్నాయి.
తొలి రోజు మెగా వేలంపాటలో 161 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండు కోట్ల రూపాయల రిజర్వ్ ప్రైస్‌గా ఉన్న ప్లేయర్లు చాలామందే ఉండనున్నారు. ప్రత్యేకించి- డైనమిక్ బ్యాటర్స్ శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, ఏస్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీతో పాటు విదేశీ ఆటగాళ్లు ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డికాక్, ఫాఫ్ డుప్లెసిస్, కగిసొ రబడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నారు.
33 మంది క్రికెటర్లు మినహా.. మిగిలిన వారందరూ వేలం పాటలో పాల్గొంటోన్న నేపథ్యంలో- ఈ మెగా వేలంపాట ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్లేయర్ల మీద ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలన్నీ ఎలా ఉంటాయనేది ఈ సాయంత్రానికి స్పష్టమౌతుంది. మెరికెల్లాంటి భారతీయ క్రికెటర్లతో పాటు విదేశీ పించ్ హిట్టర్లు ఆక్షన్ కోసం తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. 590 మంది క్రికెటర్లు ఈ మెగా ఆక్షన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ పరిణామాల మధ్య టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. తన అంచనాలను వెల్లడించాడు. మొత్తం 590 మంది పాల్గొనబోతోన్న ఈ మెగా వేలంపాటలో భారీ రేటుకు అమ్ముడుపోయే క్రికెటర్లను సెలెక్ట్ చేశాడు. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్, ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్, స్టార్ బౌలర్ యజువేందర్ చాహల్, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్- భారీ రేటుకు అమ్ముడుపోయే అవకాశం ఉందని సెహ్వాగ్ పేర్కొన్నాడు.