హైదరాబాద్: ప్రముఖులు, సెలబ్రిటీలు, మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్ల బర్త్‌డేలకు తనదైన శైలిలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ శుభాకాంక్షలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. గురువారం (డిసెంబర్ 29) పాకిస్థాన్ మాజీ స్ఫిన్నర్ సక్లయిన్ ముస్తాక్ పుట్టినరోజుని పురస్కరించుకుని తన ట్రేడ్ మార్క్ స్టైల్‌లో సెహ్వాగ్ శుభాకాంక్షలు తెలిపాడు.

2004, మార్చి 29న ముల్తాన్‌లో జరిగిన టెస్టులో సెహ్వాగ్ భారత్ తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. సక్లయిన్ బౌలింగ్‌లో సిక్సుతో తన తొలి ట్రిపుల్ సెంచరీని పూర్తి చేశాడు. ఆనాటి వీడియోని లూప్‌లో పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నానని చెబుతూ సక్లయిన్‌కి సెహ్వాగ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు.
సెహ్వాగ్ పోస్టు చేసిన ఈ వీడియోకి అభిమానుల నుంంచి బాగానే రెస్పాన్స్ వచ్చింది. సెహ్వాగ్ ట్వీట్ రెండు వేల మందికి పైగా రీట్వీట్ చేశారు. ఇక పాకిస్థాన్ తరుపున 49 టెస్టులాడిన సక్లయిన్ ముస్తాక్ 208 వికెట్లు తీసుకున్నాడు. ఇక 169 వన్డేల్లో 288 వికెట్లు తీసుకున్నాడు.
ఈ ట్రిపుల్ సెంచరీతో వీరేంద్ర సెహ్వాగ్ విదేశాల్లో భారత్ తరుపున తొలి ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత చెన్నైలో సెహ్వాగ్ దక్షిణాఫ్రికాపై రెండోసారి ట్రిపుల్ సెంచరీ సాధించి భారత క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా సెహ్వాగ్ గుర్తింపు పొందాడు.