ప్రస్తుతం భారత జట్టును ఎంపిక చేసే సెలెక్షన్ కమిటీలో చీఫ్ సెలెక్టర్ లేడు. మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఒక స్టింగ్ ఆపరేషన్‌లో సెలెక్షన్‌కు సంబంధించి చాలా విషయాలపై నోరు జారాడు. దీంతో అడ్డంగా బుక్కయిన అతను తన పదవికి రాజీనామా చేశాడు. అప్పటి నుంచి చీఫ్ సెలెక్టర్ పోస్టు ఖాళీగానే ఉంది. సెలెక్షన్ కమిటీ సమావేశాల్లో మరో సెలెక్టర్ శివ సుందర్ పాల్ తాత్కాలికంగా ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
ఈ విషయంపై ఫోకస్ పెట్టిన బీసీసీఐ.. తాజాగా ఈ పదవి కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. చేతన్ శర్మ నార్త్ జోన్‌కు చెందిన వాడు కావడంతో.. ఆ జోన్ నుంచే కొత్త సెలెక్టర్ రావలసి ఉంది. ఈ జోన్‌లో చీఫ్ సెలెక్టర్ పదవి నిర్వర్తించే సత్తా ఉన్న బడా ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే అని కొందరు అంటున్నారు. అతన్ని ఈ పదవికి దరఖాస్తు చేయాలని కోరామని, కానీ సెహ్వాగ్ అప్లై చేస్తాడని నమ్మకం లేదని బీసీసీఐ అధికారి ఒకతను చెప్పాడు.

చీఫ్ సెలెక్టర్‌కు ఏడాదికి రూ.కోటి మాత్రమే జీతం ఇస్తుంది బీసీసీఐ. ఈ ప్యాకేజీ చాలా తక్కువని, అందుకే సెహ్వాగ్ వంటి సీనియర్లు చీఫ్ సెలెక్టర్ పదవిపై ఆసక్తి చూపించడం లేదని కూడా వార్తలు వచ్చాయి. వీటిపై తాజాగా సెహ్వాగ్ క్లారిటీ ఇచ్చాడు. చీఫ్ సెలెక్టర్ పదవి కోసం బీసీసీఐ నుంచి పిలుపొచ్చిందా? ఎవరైనా సంప్రదించారా? అని అడిగిన ప్రశ్నకు సెహ్వాగ్ సమాధానం ఇచ్చాడు.
తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశాడీ మాజీ డ్యాషింగ్ ఓపెనర్. దీంతో ఈ కథ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. అయితే సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేయాలనే వారు కనీసం ఐదేళ్ల క్రితం రిటైర్‌మెంట్ ప్రకటించి ఉండాలని బీసీసీఐ నిబంధన. అలాగే భారత్ తరఫున కనీసం 7 టెస్టులు ఆడి ఉండాలని, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచులు లేదంటే 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచుల అనుభవం ఉండాలి.