
ఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌పై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు. ఇషాన్ ఇంకా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భ్రమలోనే ఉన్నాడని.. అందుకే తన విధ్వంసాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడన్నాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఆడిన ఇషాన్ (56: 32 బంతుల్లో 5x4, 4x6) మెరుపు హాఫ్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. టీమిండియాకి తొలి మ్యాచ్ ఆడుతున్న ఇషాన్.. ఈ స్థాయిలో హిట్టింగ్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు.
తాజాగా క్రిక్‌బజ్‌తో వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ... 'నాకు తెలిసి ఇషాన్ కిషన్ తాను ఆడుతుంది ఐపీఎల్ అనుకుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఐపీఎల్ తరహా ప్రదర్శన చేయడం ఇషాన్‌కు మాత్రమే చెల్లింది. ఏ మాత్రం భయం లేకుండా అతను కొట్టిన ఒక్కో షాట్ ఐపీఎల్‌లో అతని ఆటతీరును గుర్తుచేసింది. కెరీర్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నామంటే ప్రతీ ఒక్క ఆటగాడి మదిలో భయం ఉంటుంది. కానీ ఇషాన్‌లో అది కనపడలేదు. ఇంగ్లండ్ బౌలర్లను ఆటాడుకున్న ఇషాన్.. ఐపీఎల్‌లో కూడా ఇలాంటి బౌలర్లనే ఎదుర్కొన్నాడు. అందుకే అతడు అలా చెలరేగాడు' అని అన్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో పోలిక తెస్తూ ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్.. ఇషాన్ కిషన్‌ను ప్రశంసించిన విషయం తెలిసిందే. 'జార్ఖండ్ నుంచి వచ్చిన ఓ యువ కీపర్ బ్యాట్స్‌మెన్ తన సామర్థ్యమేమిటో నిరూపించుకున్నాడు. గతంలో కూడా ఇలాగే జరిగింది (ఎంఎస్ ధోనీని ఉద్దేశించి). ఏమాత్రం బెదురు లేకుండా ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేసిన తీరు ఎంతగానో నచ్చింది' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. మహీ స్వస్థలం జార్ఖండ్ అన్న సంగతి తెలిసిందే. ఇక దేశవాళీ క్రికెట్‌లో ఇషాన్ జార్ఖండ్‌కు ఆడుతున్నాడు. అందుకే వీరూ ఇలా ట్వీట్ చేశాడు.
ఇషాన్ కిషన్ 2020 ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున 14 మ్యాచ్‌ల్లో 516 పరుగులు సాధించాడు. ఇటీవలే ముగిసిన విజయ్ హజారే ట్రోపీలో ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన ఇషాన్.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. మొదటి టీ20లో విఫలమైన శిఖర్ ధావన్ స్థానంలో రెండో టీ20లో ఇషాన్ అడుగుపెట్టాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఇషాన్.. తన ఆరంభ మ్యాచ్‌లోనే 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలవడం విశేషం.
భారత్, ఇంగ్లండ్ మధ్య మంగళవారం రాత్రి 7 గంటలకి అహ్మదాబాద్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ని ఇషాన్ కిషన్ ఆరంభించే అవకాశం ఉంది. దాంతో సీనియర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితంకానున్నారు.