హైదరాబాద్: న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ రాస్ టేలర్ హిందీ నైపుణ్యానికి గాను అతడి ఆధార్ ఇవ్వగలరా? అని యూఐడీఏఐని అడిగాడు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.
అసలేం జరిగింది?
కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు గాను భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో రాస్ టేలర్ 95 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
దీంతో మ్యాచ్ అనంతరం రాస్ టేలర్‌ను సెహ్వాగ్ దర్జీతో పొల్చాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ట్విట్టర్‌లో సరదా సంభాషణ కొనసాగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వీరిద్దరూ ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు కలిసి ఆడిన సంగతి తెలిసిందే. అప్పుడే రాస్ టేలర్ హిందీ నేర్చుకున్నాడు.
తాజాగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ జరుగుతుంది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరిస్ 1-1తో సమం అయింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగే చివరి మ్యాచ్ కోసం న్యూజిలాండ్ జట్టు తిరువనంతపురం చేరుకుంది.
తిరువనంతపురం చేరుకున్న రాస్ టేలర్ అక్కడ మూసి ఉన్న దర్జీ దుకాణం ముందు కూర్చొని ఫొటో దిగాడు. ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేస్తూ 'వీరేంద్ర సెహ్వాగ్ రాజ్‌కోట్ మ్యాచ్ తర్వాత దర్జీ దుకాణం బంద్. ఇప్పుడు కుట్టే పని తిరువనంతపురంలో.. తప్పకుండా రావాలి' అంటూ సెహ్వాగ్ హిందీలో ట్వీట్ చేశాడు.
రాస్ టేలర్ హిందీని మెచ్చుకున్న సెహ్వాగ్
టేలర్ ట్వీట్‌కు స్పందించిన సెహ్వాగ్ అతడి హిందీ నైపుణ్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. 'రాస్‌టేలర్ నీ హిందీకి ముగ్ధుడినయ్యా. యూఐడీఏఐ.. అద్భుతమైన హిందీ నైపుణ్యమున్న టేలర్ ఆధార్ కార్డుకు అర్హుడవుతాడా' అని ట్వీట్ చేశాడు.
సెహ్వాగ్ ట్వీట్‌కు యూఐడీఏఐ కూడా స్పందించడం విశేషం. 'భాషతో సంబంధం లేదు. రెసిడెంట్ హోదాయే ఉండాలి' అంటూ బదులిచ్చింది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.