హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ప్రముఖుల పుట్టినరోజులకు తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్తుంటాడు.
సెహ్వాగ్ పోస్టు చేసే ట్వీట్ల కోసం అభిమానులు సైతం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అందుకు కారణం లేకపోలేదు. సెహ్వాగ్ చేసే ట్వీట్లు భిన్నంగా ఉంటాయి. తాజాగా సెహ్వాగ్ ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్‌కు తనదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
'నువ్వు బౌలింగ్ వేసేందుకు వీలు లేకుండా ఎప్పుడూ నీ చేతికి ఇలా ప్లాస్టర్ వేసి ఉండాలని బ్యాట్స్‌మెన్లు కోరుకునేవారు. హ్యాపీ బర్త్‌డే లెజండ్ షేన్‌వార్న్' అని ఓ ఫొటోని సెహ్వాగ్ పోస్టు చేశాడు. ఈ ఫొటోలో షేన్ వార్న్ తన చేతికి బ్యాండేజ్‌తో కనిపిస్తున్నాడు.
ఆసీస్ తరుపున 145 టెస్టులాడిన షేన్ వార్న్ 708 వికెట్లు తీశాడు. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసి ఆటగాళ్ల జాబితాలో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఇక, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. ప్రస్తుతం షేన్ వార్న్ కామెంటేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఇదిలా ఉంటే షేన్ వార్న్ పుట్టినరోజుని పురస్కరించుకుని పలువురు అంతర్జాతీయ ప్రస్తుత క్రికెటర్లతో పాటు మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపాడు.