
సౌథాంప్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్రికెట్ ఆంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బరిలోకి దిగాడంటే తన జట్టే గెలవాలని కోరుకుంటాడు. ఇందుకోసం కసిగా ఆడతాడు. ఈ క్రమంలోనే సీరియస్‌గా కనిపిస్తుంటాడు. అప్పుడప్పుడు సరదాగా కూడా ఉంటాడనుకోండి. మైదానంలో ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే కోహ్లీ.. ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మూడో రోజు మాత్రం మాంచి మూడ్‌లో కనిపించాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ భాంగ్రా డ్యాన్స్ చేశాడు. గ్యాలరీలోని ఫ్యాన్స్ రిథమిక్‌గా డ్రమ్స్ వాయిస్తుంటే.. విరాట్ అలా అలా డ్యాన్స్ మూడ్‌లోకి వెళ్లిపోయాడు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరిమితంగా సౌథాంప్టన్ స్టేడియంలోకి ప్రేక్షకుల్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అనుమతించింది. ఈ క్రమంలో స్టేడియానికి వచ్చిన 'భారత ఆర్మీ' సభ్యులు.. డ్రమ్స్ వాయిస్తూ టీమిండియాని ఉత్సాహపరిచారు. మూడో రోజు రెండో సెషన్‌లో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తోంది. 9వ ఓవర్‌లో భారత ఆర్మీ సభ్యులు.. భాంగ్రా మ్యూజిక్ వాయించగానే స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ తదనుగుణంగా స్టెప్‌లు వేస్తూ కనిపించాడు. అతని పక్కనే రిషబ్ పంత్, సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ, టెస్ట్ స్పెసలిస్ట్ చేతేశ్వర్ పుజారా ఉన్నారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 9వ ఓవర్ సమయంలో విరాట్ కోహ్లీ అలా డ్యాన్సింగ్ మూడ్‌లో కనిపించినా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి మాత్రం అతని మూడ్ కచ్చితంగా మారిపోయే ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌దే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను 217 పరుగులకే కట్టడి చేసిన కివీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 102 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ సాగుతున్నా కొద్ది భారత బౌలర్లు వికెట్ తీయలేకపోవడంతో భారత కెప్టెన్ కోహ్లీ కాస్త నిరాశకు గురయ్యాడు.
ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వర్షం ముప్పు తప్పేలా కనిపించడం లేదు. నాలుగో రోజు, సోమవారం సౌథాంప్టన్‌లో భారీగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు పూర్తిగా ఆట కొనసాగే పరిస్థితి ఉండదని సమాచారం. 90 శాతానికి పైగా వర్షం కురుస్తుందని అక్కడి వాతావరణశాఖ తెలిపింది. మధ్యాహ్నం వరకు అతి భారీ, ఆ తర్వాత మోస్తరు జల్లులు కురుస్తాయని అంటున్నారు. సాయంత్రానికి కాస్త తెరపినిచ్చినా వెలుతురు ఉండదని పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ టెస్టు మ్యాచులో తొలి రోజు పూర్తిగా వృథా అయింది. రెండో రోజు రెండు సెషన్ల మేరకు ఆట జరిగింది. ఇక మూడో రోజు అరగంట ఆలస్యంగా మొదలైన ఆట.. వెలుతురు లేమితో అర్ధగంట ముందుగానే ముగిసింది.