
ముంబై: రిటైర్మెంట్ ప్రకటించని టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రస్తుతం వ్యాఖ్యాతగా పలు మ్యాచ్‌లలో కనిపిస్తున్నాడు. సమయం దొరికినప్పుడల్లా తనలోని వివిధ క్రీడా నైపుణ్యాలను వెలికితీస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌తో కలిసి గోల్ఫ్ ఆడాడు. ఆ సమయంలో హర్భజన్ గోల్ఫ్ క్రీడాకారుడిగా తన నైపుణ్యాలను ప్రదర్శించాడు. అంతేకాదు కపిల్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన ఫొటోను భజ్జీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
'కపిల్ పాజీకి ధన్యవాదాలు. మీతో కలిసి క్రికెట్ ఆడకపోయినా.. ఈ రోజు గోల్ఫ్ ఆడటం చాలా సంతోషంగా ఉంది. నేను బాగా ఎంజాయ్ చేశా' అని భజ్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. ఇది చూసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ట్రోల్ చేశారు. కోహ్లీ పంజాబీ భాషలో స్పందిస్తూ.. సరదా హర్భజన్‌ను ట్రోల్ చేశాడు. 'ఆ ఫొటోలో.. నువ్వేదో గుడ్డిగా గోల్ఫ్ స్టిక్‌ను ఆడించి ఉంటావు' అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశాడు. ఇక యువరాజ్ కూడా తనదైన శైలిలో స్పందించి పంచ్ డైలాగ్ వేసాడు.
ఇటీవల యువరాజ్, హర్భజన్ బీసీసీఐపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా పంజాబ్, తమిళనాడు జట్ల మధ్య జరిగిన క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో పాయింట్ల పట్టికలో మెరుగ్గా ఉన్న తమిళనాడు ముందుకు వెళ్లగా.. పంజాబ్ సెమీస్ ఆశలకు గండిపడింది. ఈ నేపథ్యంలో నాకౌట్ మ్యాచ్‌లకు కూడా రిజర్వ్ డేను కొనసాగించాలని, బీసీసీఐ ఈ విషయంపై దృష్టిపెట్టాలని యువీ, భజ్జీ ట్విటర్ వేదికగా స్పందించారు.
ఇటీవలే ముగిసిన భారత్-దక్షిణాఫ్రికా సిరీస్‌లో హర్భజన్ సింగ్ క్రికెట్ వ్యాఖ్యాతగా అలరించాడు. రాంచీ టెస్టు సందర్భంగా జాంటీ రోడ్స్‌తో హర్భజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాంచీ టెస్టులో జాంటీ రోడ్స్ బ్యాటింగ్‌కు దిగితే దక్షిణాఫ్రికా భారీ పరుగులు సాధిస్తుంది అని సరదా కామెంట్లు చేసాడు. అయితే ఈ వ్యాఖ్యలపై జాంటీ రోడ్స్ స్పందించలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.