
హైదరాబాద్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో భారత్-హాంకాంగ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టు హాంకాంగ్‌పై విజయం సాధించి టోర్నీని ఘనంగా ఆరంభించాలని ఊవిళ్లూరుతోంది.
వర్క్‌లోడ్, రాబోయే సిరిస్‌లను దృష్టిలో పెట్టుకుని ఆసియా కప్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే. వరుస సిరీస్‌లతో అలసిపోయిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం భారత్‌లో విశ‍్రాంతి తీసుకుంటున్నాడు. అయితే, హాంకాంగ్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు టీమిండియాకు కోహ్లీ విషెస్ తెలియజేశాడు.
"ఆసియాకప్ వంటి ఒక సూపర్ సిరీస్‌లో తలపడుతున్న భారత జట్టుకు అభినందనలు" అంటూ కోహ్లీ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. కోహ్లీకి విశ్రాంతి కల్పించిన నేపథ్యంలో టోర్నీలో టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. ఆసియాకప్‌లో భారత్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా చేయడం ఇదే తొలిసారి.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హాంకాంగ్ జట్టు కెప్టెన్ అన్షుమన్ రాత్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ ద్వారా పేసర్ ఖలీల్ అహ్మద్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే తుది జట్టులో కేఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు. రోహిత్‌శర్మ, ధావన్ ఓపెనింగ్ చేయనున్నారు.
రాయుడు, దినేష్ కార్తీక్, కేదార్ జాదవ్, ధోనీ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. ఇప్పటికే టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన హాంకాంగ్ జట్టు 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్ చేతిలో ఓడిపోగా.. భారత్‌కి ఇదే మొదటి మ్యాచ్. పదేళ్ల క్రితం ఇదే ఆసియా కప్ టోర్నీలో ఇరు జట్లు ఒకసారి తలపడ్డాయి.
అప్పటి మ్యాచ్‌లో భారత్ ఏకంగా 256 పరుగులతో ఘన విజయం సాధించింది. దీంతో మరోసారి ఇరు జట్లు మరోసారి తలపడేందుకు సిద్ధమయ్యాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో బుధవారం తలపడనున్న భారత్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి లయ అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.