హైదరాబాద్: బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ నుంచి ఓ టెక్నిక్ నేర్చుకోవాలనుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ స్వయంగా ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకోవడం విశేషం. ఇంతకీ ఆ టెక్నిక్ ఏంటంటే రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించడం.
దీపావళి పండుగని పురస్కరించుకుని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ హోస్ట్‌గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముఖ్య అతిథిగా జీ టీవీ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఆదివారం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని జీటీవీ ప్రసారం చేసింది. తాజాగా, ఆమీర్‌తో కలిసి దిగిన ఫొటోలను కోహ్లీ తన ట్విటర్‌లో పోస్టు చేశాడు.
'ఆమీర్ ఖాన్‌తో గడిపిన సమయం చాలా విలువైనది. అతను ఎంతో వినయం, నిజాయతీ కలిగిన వ్యక్తి. అతని నుంచి రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించడం ఎలాగో తెలుసుకోవాలి' అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. పీకే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమీర్ రూబిక్ క్యూబ్‌ను చాలా తక్కువ సమయంలో పరిష్కరించిన సంగతి తెలిసిందే.
తాజాగా విరాట్ కోహ్లీతో పాల్గొన్న షోలో కూడా ఆమీర్ ఖాన్ చాలా తక్కువ సమయంలో రూబిక్ క్యూబ్‌ని పరిష్కరించాడు. దీంతో కోహ్లీ పై విధంగా అన్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరిస్‌కు సన్నద్ధమవుతున్నాడు.
మూడు వన్డేలు, మూడు టీ20ల పర్యటన కోసం న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే భారత పర్యటనకు చేరుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే అక్టోబర్ 22న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.