లండన్‌లోనే విరాట్ కోహ్లీ: భార్య అనూష్క శర్మ, కూతురితో కలిసి: బాహ్య ప్రపంచానికి దూరంగా

లండన్: భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో వన్డే కోసం మంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ స్టేడియం సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా ఆడబోయే చివరి మ్యాచ్ ఇదే. అనంతరం వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరి వెళ్తుంది భారత జట్టు. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ రెండు దేశాల మధ్య సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఇదివరకే జట్టును ప్రకటించింది. చోటు దక్కించుకున్న ప్లేయర్లు వెస్టిండీస్ వెళ్తారు. మిగిలిన వారు స్వదేశానికి తిరిగి వస్తారు.

విండీస్ టూర్ టీ20 స్క్వాడ్..
అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఎంపికైన జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వాన్ని వహిస్తాడు. ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్‌ను సెలెక్ట్ చేసింది. కేఎల్ రాహుల్, కుల్‌దీప్ యాదవ్.. మ్యాచ్‌లు ఆడతారా? లేదా? అనేది వారి ఫిట్‌నెస్ మీద ఆధారపడి ఉంటుంది.

శిఖర్ కేప్టెన్సీలో వన్డే సిరీస్..
మూడు మ్యాచ్‌ల వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ కోసం ఎంపికైన జట్టుకు శిఖర్ ధావన్ కేప్టెన్‌గా వ్యవహరిస్తాడు. రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కేప్టెన్), శార్దుల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ ఎంపికయ్యారు.

కోహ్లీ మిస్..
ఈ రెండు జట్లల్లోనూ విరాట్ కోహ్లీ సెలెక్ట్ కాలేదు. అతనికి విశ్రాంతి ఇచ్చారు బీసీసీఐ సెలెక్టర్లు. చాలాకాలంగా ఫామ్‌ను కోల్పోయి సతమతమౌతోన్నాడీ వరల్డ్ క్లాస్ బ్యాటర్. అనేక విమర్శలను ఎదుర్కొంటోన్నాడు. వెస్టిండీస్ సిరీస్- ఆసియా కప్ టోర్నమెంట్ మధ్యలో జరిగే ఏ సిరీస్‌కు కూడా కోహ్లీని ఎంపిక చేసే అవకాశాలు దాదాపుగా లేవు. అతణ్ని మళ్లీ ఆసియా కప్ కోసం ఎంపిక చేసే జట్టులో మాత్రమే తీసుకోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.
విశ్రాంతి కోసం..
ఈ పరిస్థితుల మధ్య కింగ్ కోహ్లీ క్రికెట్‌కు పూర్తిగా దూరం కాబోతోన్నాడు. తన సమయాన్ని కుటుంబం కోసం కేటాయించనున్నాడు. భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికాతో కలిసి అతను లండన్‌లోనే ఉండబోతోన్నాడు. నెల రోజుల పాటు లండన్‌లో భార్యబిడ్డలతో నివసించబోతోన్నాడు. ఆ తరువాత అతను స్వదేశానికి తిరిగి వస్తాడు. ఇప్పటికే అనూష్క శర్మ కుమార్తెతో కలిసి లండన్‌కు చేరుకున్నారు కూడా. ఈ నెల రోజుల పాటు లండన్‌లో ఎక్కడ ఉండబోతున్నారనేది కూడా తెలియనివ్వలేదు.

ఆగస్టులో ఆసియా కప్
ఇక మళ్లీ ఆసియా కప్ వరకు అతణ్ని మనం చూడలేకపోవచ్చు. ఆగస్టు 27వ తేదీన ఆసియా కప్ టోర్నమెంట్ ఆరంభమౌతుంది. దీనికి శ్రీలంక ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఇందులో తలపడనున్నాయి. సెప్టెంబర్ 11వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications