
అక్టోబరు-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ తన నంబర్ 3స్థానాన్ని నిలబెట్టుకుంటాడని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 2019 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సెంచరీ చేయలేదనే అపవాదును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుతం కోహ్లీ పేలవ ఫాంలో ఉన్నాడు. వెస్టిండీస్ పర్యటనతో పాటు జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు అతనికి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ రెస్ట్ ఇచ్చింది. ఇంగ్లాండ్‌తో ఇటీవల జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో అతను ప్రభావం చూపలేకపోయాడు. టీ20ప్రపంచకప్‌కు కోహ్లీ ఎంపికపై పలువురు ప్రశ్నలు రేకెత్తిస్తున్నారు. అయినప్పటికీ టీమిండియా నంబర్ 3బ్యాటింగ్ లైనప్‌లో కోహ్లీ ఉంటాడని జాఫర్ అభిప్రాయపడ్డాడు. ఓ ఆడియో సెషన్ సందర్భంగా.. జాఫర్ ఈ మేరకు తన అభిప్రాయాలను వెలిబుచ్చాడు. అలాగే టీమిండియా ప్రపంచకప్ జట్టు గురించి కూడా తనదైన విశ్లేషణలు చేశాడు. కోహ్లీ జట్టులో తన స్థానాన్ని నిలుపుకోవడమే కాకుండా.. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు భారత్‌కు శుభారంభం అందించాలని సూచించాడు.
'ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్ళు ప్రపంచకప్ జట్టుకు సహాయపడగలరు. ప్రస్తుతం భారత్ అనుసరిస్తున్న దూకుడు వైఖరిని తాను ఇష్టపడతున్నాను. టీ20ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విరాట్ జట్టులో నెంబర్ 3స్థానాన్ని నిలబెట్టుకోనున్నాడు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయాలి.' అని జాఫర్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం భారత్ వెస్టిండీస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. ప్రస్తుతం టీ20 సిరీస్లో 2-1తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. ఇక మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం రోహిత్ గాయపడ్డంతో అతను ఈ సిరీస్ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడో ఉండడో మరీ.