
హైదరాబాద్: వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా వచ్చే ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా వరుసగా 9 టెస్టు సిరిస్‌లను గెలుచుకుని ప్రపంచ రికార్డుని సమం చేసింది. దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీసేన టెస్టు సిరిస్‌ను గెలిస్తే 10 టెస్టు సిరిస్‌లను గెలవడంతో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది.
అయితే సఫారీ గడ్డ మీద భారత్‌కు అసలు సిసలైన సవాల్ ఎదురు కానుందని ఇరు దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటి దాకా సొంత గడ్డ మీద తలపడిన కోహ్లీసేనకు.. తొలిసారిగా దక్షిణాఫ్రికా పర్యటన రూపంలో కఠిన పరీక్షకు ఎదురు కానుంది. కోహ్లీసైన దక్షిణాఫ్రికా పర్యటనపై ఏబీ డివిలియర్స్ తనదైన శైలిలో స్పందించాడు.
చరిత్ర సృష్టించడానికే విరాట్ కోహ్లి దక్షిణాఫ్రికా పర్యటనకు వస్తున్నాడని ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. ఆదివారం స్ధానిక రిపోర్టర్లతో డివిలియర్స్ మాట్లాడుతూ 'కోహ్లీ ఎంతటి అంకితభావం ఉన్న కెప్టెనో మనకు తెలుసు. అతడు దక్షిణాఫ్రికాలో కచ్చితంగా చరిత్ర సృష్టించేందుకు ప్రయత్నిస్తాడు' అని డివిలియర్స్ అన్నాడు.
'మాకు ఆ విషయం తెలుసు. అందుకే కోహ్లీ సేనను ఎదుర్కోవడానికి సన్నద్ధమయ్యాం. గత కొన్ని సిరిస్‌ల్లో భారత్ అద్భుతంగా ఆడిందని, గతంతో పోలిస్తే.. ఇటీవల మా దేశంలో వారు మెరుగ్గా రాణిస్తున్నారు. భారత్ యువరక్తంతో ఉరకలేస్తోంది' అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
స్వదేశంలో భారత్‌పై గెలవడం ద్వారా టెస్టుల్లో అగ్రస్థానం చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తామని డివిలియర్స్ చెప్పాడు. 'కచ్చితంగా టెస్టుల్లో అగ్రస్ధానం కోసం ప్రయత్నిస్తాం. అందుకు ఎంతో దూరం లేదు. రాబోయే రెండు, మూడు నెలల్లో జరిగే సిరిస్‌ల్లో విజయం సాధిస్తే అది సాధ్యమే' అని అన్నాడు.
వచ్చే ఏడాది భారత్‌తో జరగనున్న సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని డివిలియర్స్, డేల్ స్టెయిన్‌లకు రెండేళ్ల తర్వాత టెస్టుల్లోకి దక్షిణాఫ్రికా సెలక్టర్లు చోటు కల్పించారు. జింబాబ్వేతో పింక్ బాల్‌తో జరగనున్న నాలుగు రోజుల టెస్టులో వీరికి చోటు లభించింది. చివరిసారిగా డివిలియర్స్ జనవరి, 2016లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో ఆడాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.