ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్స్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజే వేరు. అయితే అతడు స్పోర్టింగ్ ఐకాన్ మాత్రమే కాదు మంచి మనసున్న మనిషి కూడా. ఈ విషయాన్ని అతడు మరోసారి నిరూపించాడు. రాత్రంతా చలిలో తన కోసం ఇంటి బయటే వేచి ఉన్న ఫ్యాన్స్ కోసం విరాట్ ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు. దీంతో ఆ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఏం జరిగిందంటే?
రీసెంట్ గానే విరాట్ కోహ్లీ.. తన సొంత గడ్డపై దిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియం వేదికగా దేశవాళీ క్రికెట్ రంజీ మ్యాచ్ లో ఆడాడు. ఈ మ్యాచ్ లో విరాట్ నిరాశపరిచినప్పటికీ అతడిని చూసేందుకు భారీ స్థాయిలో అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. దాదాపు 16 వేల మంది వచ్చారని అంచనా. అయితే అక్కడికి వచ్చిన చాలా మంది ఫ్యాన్స్ తో కోహ్లీ ముచ్చటించి ఆటోగ్రాఫ్ లు కూడా ఇచ్చాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు దిల్లీ గురుగ్రామ్ లోని తన నివాసానికి వెళ్లిపోయాడు.

అయితే ఇద్దరు యంగ్ ఫ్యాన్స్ మాత్రం ఏకంగా విరాట్ నివాసం దగ్గరికి వెళ్లి మరీ అతడిని కలిసేందుకు ప్రయత్నించారు. కోహ్లీ కోసం రాత్రంతా చలిలోనే ఎదురుచూస్తూ ఇంటి బయట కూర్చున్నారు. దీంతో ఈ విషయం తెలుకున్న విరాట్ కోహ్లీ.. ఇంటి తలుపులు తెరిచి వాళ్లకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇంటికి ఆహ్వానించి మరీ ఆతిథ్యం ఇచ్చాడు. మర్చిపోలేని మధుర జ్ఞాపకాలను అందించాడు. పర్సనల్ గా వాళ్లకు బ్యాట్ పై ఆటోగ్రాఫ్ గా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.
ప్రస్తుతం ఈ ఎమోషనల్ మూమెంట్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో సదరు అభిమానులు.. విరాట్ ఇచ్చిన సర్ ప్రైజ్ ఆతిథ్యానికి ఎంతగానో సంబరపడిపోతూ కనిపించాడు.