
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవలి కాలంలో దైవభక్తిలో పడ్డాడు. అంతకుముందు నీమ్ కరోలీ బాబా ఆశ్రమానికి వెళ్లిన కోహ్లీ.. వన్డేల్లో సూపర్ ఫామ్ అందుకున్న సంగతి తెలిసిందే. శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలతో చెలరేగాడు కూడా. అయితే అతను టెస్టుల్లో ఇంకా ఫామ్ అందుకోలేదు. దీనికితోడు ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్ భారత్‌కు చాలా కీలకం. ఈ క్రమంలోనే మరోసారి ఆశ్రమాల బాట పట్టాడీ స్టార్ బ్యాటర్.
తాజాగా నెట్టింట కనిపిస్తున్న ఫొటోలో విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ ఇద్దరూ కూడా రిషికేష్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక్కడి స్వామి దయానంద్ ఆశ్రమానికి వీళ్లిద్దరూ వెళ్లారు. అక్కడ స్వామి దయానంద్ సమాధిని దర్శించుకున్నారు. కొంత కాలం క్రితం వరకు సరైన ఫామ్ లేక చాలా ఇబ్బంది పడిన కోహ్లీ.. బృందావన్‌కు కూడా వెళ్లాడు. అక్కడ ఒక బాబా ఆశీస్సులు కూడా తీసుకున్నాడు. అంతకుముందే నీమ్ కరోలీ బాబా ఆశ్రమంలో కూడా సేద తీరాడు.
ఆ తర్వాత జరిగిన వన్డే సిరీసుల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతను భారీ స్కోర్లు చేయలేదు. అయితే ఓపెనర్లు అందించిన బలమైన ఆరంభాన్ని కొనసాగించే ప్రయత్నంలో వేగంగా ఆడేందుకు కోహ్లీ ప్రయత్నించాడని, అందుకే త్వరగా అవుటయ్యాడని నిపుణులు అంటున్నారు.
వేగంగా ఆడే టెంప్లేట్ ఒక్కోసారి సక్సెస్ అయితే.. ఒక్కోసారి ఫెయిలవడం గ్యారంటీ అని తేల్చేశారు. కాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సిరీస్‌లో కూడా రాణించకపోతే ఎలా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే వన్డేల్లో రాణించడానికి ముందు చేసినట్లే.. ఆసీస్ టూర్ ముందు కూడా ఇలా స్పిరిచ్యువల్ టూర్‌కు కోహ్లీ వెళ్లడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. కచ్చితంగా ఆసీస్ సిరీస్‌లో కోహ్లీ రెచ్చిపోతాడని అంటున్నారు. మరి కోహ్లీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.