హైదరాబాద్: ఆఖరి పరుగుకి సిద్ధమైన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్‌కి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పెషల్ మెసేజ్‌ని పంపించాడు. శుక్రవారం లండన్‌లో జరుగనున్న ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న జమైకా చిరతు ఉసేన్ బోల్ట్‌కు ఇదే చివరి పరుగు కానుంది.
ఈ నేపథ్యంలో ఉసేన్ బోల్ట్ చివరి పరుగు కోసం యావత్ ప్రపంచం ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లెజెండరీ స్ప్రింటర్‌కు ప్రత్యేకమైన మెసేజ్‌ని పంపుతూ ఓ వీడియోని తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
'హే, ఉస్సేన్! ఇదే నీ చివరి రేస్ అని తెలిసింది. ట్రాక్‌పై నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాం. నాతో పాటు మన పూమా ఫ్యామిలీ సభ్యులంతా నీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు చెబుతున్నాం. నీకు ఎప్పుడైనా క్రికెట్ ఆడాలని ఉంటే, నన్ను ఎక్కడ కలుసుకోవచ్చో నీకు తెలుసు' అని బోల్ట్‌కి కోహ్లీ సూచించాడు.
కోహ్లీ ప్రత్యేక మెసేజ్‌కి ఉసేన్ బోల్డ్ ధన్యవాదాలు తెలుపుతూ రీట్వీట్ చేశాడు.
కాగా విరాట్ కోహ్లీ, ఉసేన్ బోల్ట్ ఇద్దరూ పూమా బ్రాండ్‌కి అంబాసిడర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. ఎనిమిదిసార్లు ఒలింపిక్స్ విజేతగా, ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో పదకొండు సార్లు స్వర్ణపతకాలు అందుకున్న బోల్ట్ చివరిసారిగా ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల స్ప్రింట్ విభాగంలో పోటీ పడనున్నాడు.
ఉసేన్ బోల్ట్ ఆఖరి పరుగుకి ప్రత్యేక బూట్లు సిద్ధమయ్యాయి. ప్రఖ్యాత షూ కంపెనీ 'ప్యుమా' బోల్ట్ వేగాన్ని, తేజాన్ని ఆవిష్కరించే విధంగా ఈ సరికొత్త బూట్లను తయారు చేసింది. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బోల్ట్ తల్లిదండ్రులు వెలెస్లీ, జెన్నిఫర్ బోల్ట్ అతనికి అందజేశారు.