క్రికెట్ లోకంలో తీవ్ర విషాదం.. విరాట్ కోహ్లీ మాజీ టీమ్‌మేట్ కన్నుమూత!
భారత క్రికెట్ రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టీమిండియా అండర్-19 జట్టులో విరాట్ కోహ్లీతో కలిసి ఆడిన పంజాబ్ మాజీ పేసర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ (36) చండీగఢ్‌లో కన్నుమూశారు. ఇంత చిన్న వయసులోనే ఆయన మరణించడం క్రీడా లోకాన్ని షాక్‌కు గురిచేసింది. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది.
క్రికెట్ కెరీర్, ఐపీఎల్ ప్రయాణం
అమన్‌ప్రీత్ సింగ్ పంజాబ్ తరపున దేశీవాళీ క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్‌లో 6 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. 2008లో జరిగిన ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో ఆయన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఆటగాడిగానే కాకుండా, పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా కూడా అమన్‌ప్రీత్ సింగ్ సేవలందించాడు.

విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ నివాళులు
అమన్‌ప్రీత్ మరణ వార్త తెలిసిన వెంటనే విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తన మాజీ సహచరుడి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ.. "అమన్‌ప్రీత్ గిల్ మరణ వార్త విని షాక్‌కు గురయ్యాను. చాలా బాధగా ఉంది. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి" అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. అమన్‌ప్రీత్ మరణంపై టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ భావోద్వేగంగా స్పందించాడు. "అమన్‌ప్రీత్ మరణ వార్త విని తీవ్రంగా చలించిపోయాను. కెరీర్ ప్రారంభ రోజుల్లో నేను అతనితో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాను. అతను చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు, ఆటను అమితంగా ప్రేమించే కష్టజీవి" అని యువీ పేర్కొన్నాడు.
క్రీడా ప్రపంచం నివాళులు
అమన్‌ప్రీత్ అండర్-19 రోజుల్లో కోహ్లీతో పాటు పలువురు స్టార్ ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నారు. ఆయన మృతి పట్ల పంజాబ్ క్రికెట్ అసోసియేషన్, పలువురు మాజీ క్రికెటర్లు నివాళులర్పించారు. కేవలం 36 ఏళ్లకే ఓ ప్రతిభావంతమైన క్రికెటర్ మరణించడం పంజాబ్ క్రికెట్‌కు తీరని లోటుగా మిగిలిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications