30వ పడిలోకి కోహ్లీ: టాప్-5 వన్డే సెంచరీలు మీకోసం...

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం 30వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీకి సోషల్ మీడియాలో మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన అద్భుతమైన ఆటతీరుతో ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లీ... రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
విరాట్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు ప్రస్తుత ఆటగాళ్లు మహ్మద్ షమీ, సురేశ్ రైనా, వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని తదితరులు ఉన్నారు. మరోవైపు బీసీసీఐ ప్రత్యేకంగా ఓ వీడియోని తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.
కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా వన్డేల్లో టాప్-5 సెంచరీలు మీకోసం:

1. 133 Vs శ్రీలంక, 2012
హోబర్ట్‌లోని బ్లండ్ స్టోన్ ఏరెనా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముక్కోణపు సిరిస్ ఫైనల్లోకి చేరుకోవాలంటే శ్రీలంకపై టీమిండియా బోనస్ పాయింట్ తేడాతో విజయం సాధించాలి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు సచిన్, సెహ్వాగ్ వికెట్లను కోల్పోవడంతో ఫైనల్ బెర్తు ఖాయమనుకుని ధీమాగా ఉంది. టీమిండియాకు బోనస్ పాయింట్ రావాలంటే 40 ఓవర్లలోపే ఈ భారీ లక్ష్యాన్ని చేధించాలి. క్రీజులోకి వచ్చిన కోహ్లీ శ్రీలంక బౌలర్లను చీల్చి చెండాడటంతో టీమిండియా 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్లో కోహ్లీ 86 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సులతో 133 పరుగులు చేశాడు. లసిత్ మలింగ వేసిన ఓ ఓవర్‌లో కోహ్లీ 24 పరుగులు పిండుకున్నాడు.

2. 183 Vs పాకిస్థాన్, 2012
హోబర్ట్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన కొన్ని వారాల తర్వాత విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి ఈ సెంచరీ వెలువడింది. ఢాకా వేదికగా జరిగిన ఆసియా కప్‌లో పాకిస్థాన్ 329 పరుగులు చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 148 బంతుల్లో 183 పరుగులు చేయడంతో రెండు ఓవర్లు మిగిలుండగానే టీమిండియా విజయం సాధించింది. ఈ కీలక ఇన్నింగ్స్ తర్వాత విరాట్ కోహ్లీ తనలోని ఆటను మరింతగా మెరుగుపరచుకున్నాడు.

3. 122 Vs ఇంగ్లాండ్, 2017
స్వదేశంలో పుణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 350 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 105 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులతో 122 పరుగులు నమోదు చేశాడు.

4. 115 Vs ఆస్ట్రేలియా, 2013
ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ జార్జి బెయిలీ, షేన్ వాట్సన్ సెంచరీలు సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 350 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు తొలి వికెట్‌కు 178 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో 20 ఓవర్లలో భారత విజయానికి 173 పరుగులు అవసరమయ్యాయి. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ 66 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో సెంచరీ నమోదు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

5. 107 Vs పాకిస్థాన్, 2015
వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ భారీ లక్ష్యం సాధించడంలో కోహ్లీ కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 126 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 107 పరుగులు సాధించాడు. కోహ్లీ సెంచరీతో పాటు ఓపెనర్ శిఖర్ ధావన్, సురేశ్ రైనా రాణించడంతో టీమిండియా 301 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ను మహమ్మద్ షమీ నాలుగు వికెట్లు తీసి బోల్తా కొట్టించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications