హైదరాబాద్: ప్రపంచకప్ ముగిసింది. 46 రోజుల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఈ మెగా టోర్నీలో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ విశ్వ విజేతగా నిలిచింది. టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు సిద్ధమైంది. అయితే, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయం సెలక్టర్లను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ముందస్తు షెడ్యూల్ ప్రకారం వెస్టిండిస్ పర్యటనలో కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావించారు. అయితే, ప్రపంచకప్ సెమీస్ నుంచి టీమిండియా నిష్క్రమణ, కెప్టెన్సీ మార్పులంటూ వార్తలు తెరపైకి రావడంతో విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
తనకు విశ్రాంతి అవసరం లేదని వెస్టిండిస్ పర్యటనకు వెళతానని సెలక్టర్లతో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో విండిస్ పర్యటనకు ఆటగాళ్ల ఎంపిక అటు సెలక్టర్లతో పాటు ఇటు బీసీసీఐకి కూడా పెద్ద తలనొప్పిగా మారింది. విండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.
ఆగస్టు 3న జరిగే తొలి టీ20తో వెస్టిండిస్ పర్యటన ప్రారంభం కానుంది. "విండీస్ పర్యటనకు విశ్రాంతి తీసుకోవడానికి కోహ్లీకి ఇష్టపడటం లేదు, ప్రపంచకప్ ఓటమి అనంతరం అతడు చాలా కుంగిపోయాడు. క్రికెట్‌తోనే మరల పునరుత్తేజం లభిస్తుందని భావించడంతో కోహ్లి తన నిర్ణయం మార్చుకున్నాడు" అని బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
మరోవైపు టీమిండియా వెస్టిండిస్ పర్యటనలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. వాస్తవానికి ప్రపంచకప్ అనంతరం ఆటకు వీడ్కోలు పలుకుతానన్న క్రిస్ గేల్.. టీమిండియాతో సిరీస్ ముగిశాక క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని ప్రకటించాడు.