
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌లో రెండు అరుదైన రికార్డులకు చేరువలో ఉన్నాడు. గ్రౌండ్‌లోకి దిగాడంటే బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ సునాయసంగా పరుగులు రాబట్టే ఈ రన్‌మెషీన్ తన కెరీర్‌లో రన్స్ పరంగా ఓ మైల్‌స్టోన్‌కు చేరువయ్యాడు. ఇప్పటివరకు టెస్టు క్రికెట్‌లో 97 మ్యాచ్‌లు ఆడాడు కోహ్లీ. 50 సగటుతో 7,801 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఏకంగా 7 సార్లు డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు.
అయితే 33 ఏళ్ల విరాట్ కోహ్లీ రానున్న దక్షిణాఫ్రికా సిరీస్‌లో మరో 199 పరుగులు చేస్తే టెస్టు క్రికెట్‌లో 8 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. తద్వారా టెస్టు క్రికెట్‌లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆరో భారత బ్యాటర్‌గా కోహ్లీ చరిత్రకెక్కుతాడు. కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే ఈ మైలు రాయిని అందుకున్నారు. అంతేకాకుండా అత్యంత వేగంగా 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్న నాలుగో భారత బ్యాటర్‌గా కోహ్లీ నిలుస్తాడు.
కోహ్లీ కంటే ముందు సచిన్, ద్రావిడ్, సెహ్వాగ్ ఉన్నారు. సచిన్ 154 ఇన్నింగ్స్‌లో 8 వేల పరుగుల మైలు రాయిని అందుకోగా, ద్రావిడ్ 158 ఇన్నింగ్స్‌ల్లో, సెహ్వాగ్ 160 ఇన్నింగ్స్‌లో అందుకున్నారు. కాగా కోహ్లీ ఇప్పటికే 164 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అలాగే ఇప్పటివరకు టెస్టు క్రికెట్‌లో 27 సెంచరీలు చేసిన కోహ్లీ ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన స్టీవ్ స్మిత్, అలన్ బోర్డర్, గ్రేమ్ స్మిత్‌లతో కలిసి 17వ స్థానంలో ఉన్నాడు.
అంతేకాకుండా దక్షిణాఫ్రికా పర్యటన ద్వారా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని చేరుకోనున్నాడు. ఈ సిరీస్‌లోని మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడడం ద్వారా టెస్టు ఫార్మాట్‌లో 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కొద్ది మంది ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ కూడా నిలుస్తాడు. కెరీర్‌లో ఇప్పటివరకు 97 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ కేప్‌టౌన్ వేదికగా జరగనున్న మూడో టెస్టు మ్యాచ్ ద్వారా ఈ ఘనతను చేరుకుంటాడు. అంతేకాకుండా 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన 12వ భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఈ లిస్టులో 200 టెస్టు మ్యాచ్‌లు ఆడి ప్రపంచంలోనే ఎవరికీ అందనంత ఎత్తులో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నంబర్ వన్ ప్లేసులో ఉన్నాడు.