హైదరాబాద్: కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. నాలుగో వన్డేలో 38 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ 76 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 100 పరుగులను నమోదు చేశాడు.
వన్డేల్లో కోహ్లీకి ఇది 29వ సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీతో శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య 28 సెంచరీల రికార్డుని విరాట్ కోహ్లీ అధిగమించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన వారిలో సచిన్ టెండూల్కర్ (49) అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఆ తర్వాత 30 సెంచరీలతో ఆసీస్ మాజీ క్రికెటర్ రికీపాంటింగ్ ఉన్నాడు.

శ్రీలంకపై విరాట్ కోహ్లీకి ఇది 7వ సెంచరీ కావడం విశేషం. శ్రీలంక సిరిస్‌లో మరో మ్యాచ్ మిగిలుండటంతో రికీ పాంటింగ్‌ను విరాట్ కోహ్లీ దాటేసినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. కోహ్లీ 185 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధిస్తే సచిన్‌కు 265, పాంటింగ్ 330 ఇన్నింగ్స్ తీసుకున్నారు.
మరోవైపు ఈ వన్డేలో విరాట్ కోహ్లీ మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకపై 44 ఇన్నింగ్స్‌లోనే 2000 పరుగులు చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మరోవైపు రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో వరుసగా రెండో సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 168 బంతుల్లో 219 పరుగులు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

తద్వారా ఈ జోడీ 200కిపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ఇది మూడోసారి కావడం విశేషం. ఇక 150కిపైగా పరుగులు చేయడం ఎనిమిదో సారి. ఇదిలా ఉంటే ఈ వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీని అవుట్ చేయడం ద్వారా శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ 300వ వన్డే వికెట్ సాధించాడు. 300 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మలింగ 11వ స్థానంలో కొనసాగుతున్నాడు.