
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ తన డ్రీమ్ వికెట్ అని పాకిస్థాన్ పేస్ బౌలర్ రుమ్మాన్ రయిస్ వెల్లడించాడు. తన క్రికెట్ కెరీర్‌లో ఒక్కసారైనా విరాట్ కోహ్లీ వికెట్ తీసుకుంటే అదే తాను సాధించిన గొప్ప అని పేర్కొన్నాడు. దుబాయి వేదికగా జరుగుతోన్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు ఆడుతున్నాడు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 'స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌కు ఇప్పటివరకు బౌలింగ్ చేయలేదు. అయితే కేన్ విలియమ్సన్‌కు బౌలింగ్ చేశా. అతడిని ఔట్ చేయడం కష్టం. చాలా టెక్నిక్‌గా ఆడతాడు. గతేడాది కివీస్‌తో జరిగిన వన్డే సిరిస్‌లో అతడిని నా బౌలింగ్‌లో నాలుగు సార్లు ఔట్ చేశా' అని అన్నాడు.
'తన కెరీర్‌లో ఇప్పటివరకు తనకు తారసపడిన అత్యంత కఠినమైన బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లా' అని పేర్కొన్నాడు. భారత్-పాక్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరిస్‌లు జరగని సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి.
'కోహ్లీకి నేనేమీ ఛాలెంజ్ విసరడం లేదు. కోహ్లీ, స్మిత్, డివిలియర్స్‌లకు బౌలింగ్ వేసే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా వికెట్లు తీస్తా. నిజంగా అదొక అద్భుతమైన ఫీలింగ్' అని చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ తరుపున రయిస్ ఇప్పటివరకు 9 వన్డేలు, 8 టీ20 మ్యాచ్‌లాడాడు.