హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మతో ఉన్న ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. మహిళా దినోత్సవం సందర్భంగా తన ప్రేయసి అనుష్క శర్మ, తన మాతృమూర్తి ఉద్దేశించి ఓ ప్రత్యేకమైన మెసేజ్‌ను పోస్టు చేశాడు. తన జీవితంలో ముఖ్యమైన ఇద్దరు మహిళల గురించి ఇలా చెప్పుకొచ్చాడు.
'అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా నా జీవితంలోని ఇద్దరు శక్తిమంతమైన మహిళలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మ క్లిష్టమైన పరిస్థితుల్లో ధైర్యంగా నిలిచి మమ్మల్ని పెంచింది. నిరంతరం కష్టాలను ఎదుర్కొంటూ మంచికై నిలబడి, మార్పుకై తపిస్తున్న అనుష్క శర్మకు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేశాడు.
ఈ సందర్భంగా వారిద్దరితో వేరువేరుగా తాను దిగిన ఫొటోను అభిమానుల కోసం షేర్ చేశాడు. కోహ్లీ చేసిన ఈ పోస్టుకు గంటలోపే 3 లక్షలకుపైగా లైకులు వచ్చాయి. గత నెల వాలెంటైన్స్ డే సందర్భంగా కూడా తన ప్రేయసి అనుష్క శర్మ కోసం ఓ ప్రత్యేకమైన పోస్టును కోహ్లి తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే.