
సౌతాంప్టన్: రెండు టెస్టుల ఓటమి అనంతరం.. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ 203 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తరపున అరంగేట్రం చేసిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ పట్ల ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అసభ్యంగా ప్రవర్తించి రిఫరీలతో చివాట్లు కూడా తిన్నాడు. అయితే జట్టును ముందుండి నడిపించే కెప్టెన్ కోహ్లి ఆటగాళ్లను వెన్నంటి ప్రోత్సహించడంలోను ముందుంటాడు.
యువ ఆటగాళ్లకు మైదానంలో ఎదురయ్యే స్లెడ్జింగ్‌పై తనదైన శైలిలో స్పందిస్తూ మద్దతు పలుకుతాడు. ఇలా ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రాడ్‌కు కోహ్లి దిమ్మతిరిగేలా చేశాడు. స్లెడ్జింగ్ అంటే ఎంటో పాఠాలు చెప్పాడు. షమీ బౌలింగ్‌లో బ్రాడ్ బ్యాటింగ్ చేస్తుండగా.. టీమిండియా ఫీల్డర్లు 'కమాన్ షమ్మో' అని అరవసాగారు. ఇది బ్రాడ్‌కు కొంత ఇబ్బంది కలిగించింది.
వెంటనే కోహ్లితో 'మ్యాన్.. వారు చాలా కోపంగా ఉన్నారు' అని అన్నాడు. దీనికి కోహ్లి 'ఇంతకుముందు యంగ్‌స్టర్‌తో నువ్వు ప్రవర్తించిన దానికి సమాధానం' అని తెలిపాడు. వెంటనే రియలైజ్ అయిన బ్రాడ్.. 'ఇది టెస్టు క్రికెట్.. ఇలాంటి కోపాలన్నీ మామూలే.' అని కోహ్లికి బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. 'చేసిన దానికి తగ్గట్లే స్పందిస్తాం' అనే రీతిలో కోహ్లీ సమాధానమివ్వడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించిన బ్రాడ్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ ఇచ్చారు. బ్యాట్స్‌మన్ ఔటైనప్పుడు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ, అసభ్య సంకేతాలతో ఎగతాళి చేస్తే ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.1.7 ప్రకారం తప్పిదంగా పరిగణిస్తారన్న విషయం తెలిసిందే. ఇక ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది. నాలుగో టెస్టు సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభంకానుంది.