హైదరాబాద్: మొహాలిలో ఆదివారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 154 (నాటౌట్)తో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీపై ప్రశంసలు వెల్లువెత్తాయి.
భారత క్రికెటర్లు, మాజీలు కోహ్లీని అభినందిస్తూ ట్వీట్లు పోస్టు చేశారు. కాగా టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం తనదైన శైలిలో కోహ్లీని పొగుడుతూ సరదా ట్వీట్లు చేశాడు. 'చాంపియన్ విరాట్ కోహ్లీ రోజూ చేసే పని ఇదే. నిద్ర లేవడం.. తినడం.. సెంచరీ చేయడం.. పడుకోవడం.. ఇదే పని' ట్వీట్ చేశాడు.

'కోహ్లీ న్యూజిలాండ్ బౌలర్ ట్రెండ్ బౌల్ట్‌పై సర్జికల్ దాడులు చేశాడు. ఓ ఓవర్లో వరుసగా 4, 2, 4, 6, 2,4 పరుగులు చేశాడు' అంటూ జడేజా మరోసారి ట్వీట్ చేశాడు. ఇక మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్.. కోహ్లీ ఎందుకు స్పెషలో మరోసారి నిరూపించుకున్నాడని కొనియాడాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాళ్లలో ఒకరిని చూశామని, ఛేజింగ్‌లో కోహ్లీ ఎప్పటిలాగే మరో సెంచరీ చేశాడని కామెంటేటర్ హర్ష భోగ్లే ట్వీట్ చేశాడు. భారత క్రికెటర్లు హర్భజన్, మహ్మద్ కైఫ్‌తో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలైన ముంబై, చెన్నైలతో పాటు మైఖేల్ వాన్‌లు కోహ్లీపై ప్రశంసలు కురిపించారు.