టీమిండియా ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా తాజాగా కింగ్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. విరాట్ కోహ్లీ స్టేడియంలో ఎంత దూకుడుగా ఉంటాడో వ్యక్తిగత జీవితంలో అంత సరదాగా ఉంటాడని హర్షిత్ పేర్కొన్నాడు.
ఆ సరదా సంఘటన ఇదే..!
ఐపీఎల్‌లో కేకేఆర్ జట్టు తరఫున మెరిసి ఆపై భారత జట్టులో చోటు సంపాదించుకున్న హర్షిత్ రాణా తొలిసారి అనుష్క శర్మను కలిసినప్పటి అనుభవాన్ని వివరించాడు. "నేను తొలిసారి అనుష్క శర్మను కలిసినప్పుడు గౌరవంగా 'మేడమ్' అని పిలిచాను. అది విన్న విరాట్ వెంటనే నన్ను ఆపి.. 'ఆమెను మేమ్ అని పిలవద్దు, బాబీ(వదిన) అని పిలువు' అని చెప్పాడు" అని హర్షిత్ గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో విరాట్ సరదాగా అనుష్కతో.. "చూడు అనుష్క.. బయట నా మీద షాంపైన్ చిలకించి ఎంజాయ్ చేసే ఈ కుర్రాడు, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి చాలా పద్ధతిగా 'మేడమ్' అని పిలుస్తున్నాడు" అని ఆటపట్టించాడట.

విరాట్, హార్ధిక్‌లపై నా అంచనా తప్పైంది!
టీవీలో చూసినప్పుడు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు చాలా కోపంగా, దూకుడుగా కనిపిస్తారని, అందరినీ భయపెడతారని తాను భావించానని హర్షిత్ అన్నాడు. "కానీ వారితో కలిసి ఉన్నప్పుడు అసలు విషయం తెలిసింది. వారు చాలా సరదాగా ఉంటారు. అందరినీ నవ్విస్తూ, ఎంతో సపోర్టివ్‌గా ఉంటారు" అని హర్షిత్ చెప్పుకొచ్చాడు.
కివీస్‌తో సిరీస్ ఓటమి - హర్షిత్ పోరాటం
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 1-2తో ఓడిపోయిన సంగతి తెలిసిందే. చివరి వన్డేలో విరాట్ కోహ్లీ (124) శతకంతో చెలరేగగా, హర్షిత్ రాణా కూడా అద్భుతమైన హాఫ్ సెంచరీతో పోరాడాడు. వారిద్దరి మధ్య మంచి భాగస్వామ్యం నెలకొన్నప్పటికీ.. టీమిండియా విజయం తీరాలకు చేరుకోలేకపోయింది. కోచ్ గౌతమ్ గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ హర్షిత్ ప్రస్తుతం టీమిండియాలో కీలక ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు.