హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఫేస్‌బుక్‌లో భారత్ నుంచి అత్యధిక మంది ఫాలోవర్లు సంపాదించుకున్న రెండో భారతీయుడిగా కోహ్లీ నిలిచాడు. అగ్రస్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ మొదటి స్ధానంలో కొనసాగుతున్నారు. మోడీ తర్వాతి స్ధానంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఉన్నాడు.
అయితే తాజాగా విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను అధిగమించాడు. ప్రస్తుతం 3 కోట్ల 57 లక్షల మంది కోహ్లీని ఫాలో అవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ (4 కోట్ల 22 లక్షలు) అగ్రస్థానంలో ఉన్నారు. కోహ్లీ ఫేస్‌బుక్ ఖాతాని 35,735,344 మంది లైక్ చేయగా 35,442,293 మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఇక ప్రధాని మోడీ పేజీని అత్యధికంగా 42,296,877మంది లైక్ చేయగా 41,791,637 మంది ఫాలోవర్లగా ఉన్నారు. ఇక సల్మాన్‌ఖాన్ పేజీని 35,125,370మంది లైక్ చేయగా 34,857,736మంది ఫాలోవర్లు ఉన్నారు. కెప్టెన్ కోహ్లీ ప్రస్తుతం భారత జట్టుకు మూడు ఫార్మెట్లలో కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు.
ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ 180 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రధాన కోచ్ కుంబ్లేతో వివాదం తదితర అంశాలుఆసక్తికరంగా మారడంతో కోహ్లీ ఖాతాను ఫాలో అయ్యే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది.
సల్మాన్ ఖాన్ (35,123,804) తర్వాత దీపికా పదుకుణే (34,049,889), ప్రియాంక చోప్రా (31,769,426), అమితాబ్ బచ్చన్ (27,129,029) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇటీవలే ఫోర్బ్స్ జాబితాలో అత్యధిక పారితోషకం అందుకుంటోన్న భారత క్రీడాకారుల్లో కోహ్లీ 83వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత కోహ్లీసేన ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ ఆడేందుకు వెస్టిండిస్‌లో పర్యటిస్తోంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో వెస్టిండిస్‌పై 105 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.