స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో సత్తాచాటారు. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో రాణించిన వీరిద్దరు తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నారు. కోహ్లి మూడు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి దూసుకొచ్చాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 10వ ర్యాంక్‌లో నిలిచాడు.
దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. తొలి టెస్టులో 38, 76 పరుగులు చేసిన కోహ్లి కఠిన పిచ్‌పై జరిగిన రెండో టెస్టులో 46, 12 పరుగులు చేశాడు. మరోవైపు రోహిత్ రెండు టెస్టుల్లో 5, 0, 39, 17* రన్స్ చేశాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో విఫలమైన పాకిస్థాన్ కీలక ప్లేయర్ బాబార్ అజామ్ ఆరో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోయాడు.

టాప్-5 ర్యాంకింగ్స్‌లో కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్, లబుషేన్ , డారిల్ మిచెల్ ఉన్నారు. విలియమ్సన్ 864 రేటింగ్ పాయింట్లు సాధించగా కోహ్లి 775 పాయింట్లతో ఉన్నాడు. బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. బుమ్రా నాలుగు, జడేజా అయిదో స్థానంలో ఉన్నాడు. సిరాజ్ 13 స్థానాలు ఎగబాకి 17వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
టెస్టు ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో టాప్-10 టీమిండియా ప్లేయర్లు ముగ్గురు ఉన్నారు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తొలి రెండు స్థానాల్లో ఉండగా, అక్షర్ పటేల్ అయిదో స్థానంలో ఉన్నారు. మరోవైపు టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ (117) రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (121) అగ్రస్థానంలో నిలిచింది.
కాగా, రేపటి నుంచి అఫ్గానిస్థాన్‌తో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. మొహాలి వేదికగా రాత్రి 7 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. అఫ్గాన్‌తో సిరీస్ అనంతరం భారత్ స్వదేశంలో ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది.