నా కెరీర్లో ప్రపంచం ముగిసిందనుకున్నా.. మనస్సు సరిగ్గా లేనప్పుడు విరామం అవసరం: కోహ్లీ

హైదరాబాద్: ఇటీవలే మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకున్న విషయం తెలిసిందే. మ్యాక్స్‌వెల్ తీసుకున్న నిర్ణయానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతు పలికాడు. మ్యాక్స్‌వెల్ నిర్ణయం అసాధారణమని ప్రశంసించాడు. తన కెరీర్లో కూడా ఇలాంటి సంధి దశను ఎదుకున్నానని, ఆ సమయంలో ప్రపంచం ముగిసిందనుకున్నా అని కోహ్లీ తెలిపాడు.

మ్యాక్స్‌వెల్ చేసింది గొప్పపని:
మ్యాక్స్‌వెల్ స్వల్ప విరామం తీసుకోవడంతో క్రికెటర్ల మానసిక ఆరోగ్య పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు అందరూ ఆ విషయంపైనే మాట్లాడుకుంటున్నారు. తాజాగా విరాట్ కోహ్లీ కూడా ఓ మీడియా సమావేశంలో తన 2014 ఇంగ్లాండ్ పర్యటన అనుభవాలను పంచుకున్నాడు. 'అంతర్జాతీయ స్థాయిలో జట్టులోని ప్రతి ఆటగాడికి కమ్యూనికేషన్ చాలా అవసరం. అన్ని విషయాలు పంచుకోగలిగే సామర్థ్యం ఆటగాడికి ఉండాలి. మ్యాక్స్‌వెల్ చేసింది గొప్పపని నేను భావిస్తున్నా' అని కోహ్లీ అన్నాడు.

ప్రపంచం ముగిసిపోయిందనుకున్నా:
'నా కెరీర్లో కూడా ఇలాంటి దశను ఎదుర్కొన్నా. ఆ సమయంలో ఇక ప్రపంచం ముగిసిపోయిందనుకున్నా. ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో తెలియలేదు' అని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. 'అవతలి వ్యక్తుల మనస్సులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. మ్యాక్స్‌వెల్ తన నిర్ణయంతో ఈ ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలిచాడు. మనస్సు సరిగ్గా లేనప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాం. అలా కాకుండా.. కొంత విరామం తీసుకోవడం అవసరం' అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఆటను వదిలేయాలని చెప్పను:
'నిజం చెప్పాలంటే.. నేను మానసికంగా పూర్తి ఆరోగ్యంగా లేనని, ఆట నుంచి దూరంగా వెళ్లిపోతానని ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే దానిని ఎలా అంగీకరించాలో నాకు తెలియదు. ఆటను వదిలేయాలని నేను చెప్పను. ముందుకు సాగలేనప్పుడు, ఇబ్బందిగా అనిపించినప్పుడు మాత్రమే విరామం తీసుకోవడం అవసరం. ఇలాంటి నిర్ణయాలను అందరూ గౌరవించాలి. ప్రతికూలంగా భావించొద్దు' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఇండోర్‌లో తొలి టెస్టు:
బంగ్లాతో జరిగిన టీ20 సిరీస్‌ను విజయవంతంగా ముగించిన టీమిండియా.. టెస్ట్ సన్నాహకాల్లో మునిగింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లీ సేన మరో సిరీస్‌ను కూడా ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం ఇండోర్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ కోసం ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. కోల్‌కతాలో జరిగే తొలి డే-నైట్ మ్యాచ్ కోసం ఫ్లడ్‌లైట్ల కింద గులాబీ బంతిని ఎలా ఎదుర్కోవాలి అని ఆటగాళ్లు అందరూ పింక్ బాల్‌తో కూడా నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications