హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 80 పరుగుల తర్వాత దూకుడుగా ఆడతారని ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు. ఓ ప్రముఖ ఇంగ్లీషు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో బెన్ స్టోక్స్ ఈ తరంలో నలుగురు గొప్ప బ్యాట్స్‌మెన్ ఎవరని అంటే తడుముకోకుండా 'జో రూట్, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్' అని చెప్పాడు.
ఎందుకంటే వారు సెంచరీలు చేసే వరకు వికెట్ ఇవ్వరని అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, తాను ఒకేలా ఆలోచిస్తామని బెన్ స్టోక్స్ తెలిపాడు. తమతో ఆడేటప్పుడు జో రూట్ ను ఎలా అవుట్ చేయాలా? అని వాళ్లు ఆలోచిస్తే.. తాము కోహ్లీ, స్మిత్, విలియమ్సన్ ను ఎలా అవుట్ చేయాలా? అని ఆలోచిస్తామని చెప్పాడు.

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతాడని, అదే కోహ్లీ, స్మిత్ 100 పరుగుల తర్వాత విధ్వంసం సృష్టిస్తారని పేర్కొన్నాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు కోహ్లీ, తాను ఒకేలా ఆలోచిస్తామని బెన్ స్టోక్స్ వెల్లడించడం విశేషం. ఐపీఎల్‌లో బెన్ స్టోక్స్ స్టీవ్ స్మిత్ సారథ్యంలో పూణె జట్టు తరుపున ఆడనున్నాడు.
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ప్రాంఛైజీ బెన్ స్టోక్స్‌ని రూ.14.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతక ముందు ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాట్సన్‌ను రాజస్ధాన్ రాయల్స్ జట్టు రూ. 9.5 కోట్లకు కోనుగోలు చేసింది.
ఐపీఎల్‌లో యువరాజ్ సింగ్ అత్యధికంగా రూ. 16 కోట్లు పలికి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. విదేశీ ఆటగాళ్లలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా బెన్ స్టోక్స్ గుర్తింపు పొందాడు. అతడి తర్వాత ఇంగ్లాండ్‌కు చెందిన తైమాల్ మిల్స్‌ను రూ. 12 కోట్లు పెట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్రాంఛైజీ కొనుగోలు చేసింది.