హైదరాబాద్: కొత్త కోచ్ ఎంపిక విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు స్పందించాడు. కొత్త కోచ్‌ని ఎంపిక చేసే విషయంలో బీసీసీఐకి వ్యక్తిగతంగా తాను ఎవరి పేరుని సూచించనని కోహ్లీ స్పష్టం చేశాడు. అయితే కోచ్ విషయంలో బీసీసీఐ తన అభిప్రాయం అడిగితేనే చెబుతానని అన్నాడు.
కొత్త కోచ్ గురించి అభిప్రాయం చెప్పాల్సిందిగా కోహ్లీని ప్రశ్నించగా పై విధంగా పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా తానేమీ చెప్పదలుచుకోలేదని పేర్కొన్నాడు. బోర్డు తమను సంప్రదిస్తే మాత్రం జట్టు తరఫున సభ్యులంతా అభిప్రాయం చెబుతామని అన్నాడు.
బీసీసీఐకి ఓ విధానం అంటూ ఉంటుందని, జట్టు దానిని అనుసరించాల్సి ఉంటుందని కోహ్లీ స్పష్టం చేశాడు. అంతేకాదు కోచ్ ఎంపికపై బహిరంగ చర్చ అనవసరమని కూడా కోహ్లీ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం తమ లక్ష్యం విండీస్‌పై వన్డే సిరీస్ నెగ్గడమేనని తెలిపాడు.

ఇదిలా ఉంటే ప్రధాన కోచ్ రేసులోకి అనూహ్యంగా దూసుకొచ్చిన టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రికి కోచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ కోహ్లీతో పాటు క్రికెట్ సలహా కమిటీలో సభ్యుడిగా ఉన్న సచిన్ టెండూల్కర్ కూడా శాస్త్రి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు నిజానికి రవిశాస్త్రి కొన్ని రోజుల కింది వరకు కోచ్ పదవికి దరఖాస్తు చేసేందుకు సుముఖంగా లేడు. అసలు దరఖాస్తే చేయనని చెప్పిన ఈ మాజీ కెప్టెన్ ఉన్నట్టుండి మనసు మార్చుకోవడానికి గల కారణాలేంటి? నిజానికి కోచ్ పదవి కోసం మళ్లీ తాను ఇంటర్వ్యూకు హాజరు కాలేనని, బాధ్యతలు ఇస్తే స్వీకరిస్తానని స్పష్టంగా చెప్పాడు.
దీని వెనుక అసలు ఏం జరిగింది. ఉన్నపళంగా రవిశాస్త్రి కోచ్ పదవికి దరఖాస్తు చేస్తానని చెప్పడం ఆశ్చర్య పరిచింది. అందరూ అనుకుంటున్నట్లుగా ఈ మొత్తం ఎపిసోడ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీయే సూత్రధారియా లేక మరెవరికైనా సంబంధం ఉందా? అంటే ఓ ఆసక్తికర కోణం బయటకు వచ్చింది.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్... రవిశాస్త్రితో మాట్లాడి అతన్ని కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేలా ఒప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది అనిల్ కుంబ్లే కంటే ముందు టీమిండియాను రవిశాస్త్రి డైరెక్టర్ హోదాతో నడిపించాడు. ఆయన మార్గదర్శనంలోనే భారత జట్టు టి20, వన్డే ప్రపంచకప్‌లలో సెమీఫైనల్స్ చేరింది.
ఆ తర్వాత బీసీసీఐ కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించడం... రవిశాస్త్రిని కాదని కుంబ్లేను కోచ్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏడాది తర్వాత తాజాగా కోహ్లీతో విభేదాల కారణంగా కోచ్ పదవికి కుంబ్లే రాజీమానా చేయడం... ఖాళీ అయిన కోచ్ పదవికి బీసీసీఐ మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించింది.
ఇప్పటికే సెహ్వాగ్, టామ్ మూడీతో సహా పలువురు చీఫ్ కోచ్ పదవికి దరఖాస్తులు చేశారు. ఇప్పుడు శాస్త్రి కూడా జతకావడంతో అనిల్ కుంబ్లే వారసుడిని ఎంపిక చేసే పనిలో సీఏసీ నిమగ్నమైంది. అయితే కోచ్ ఎంపికలో బీసీసీఐ వైఖరి ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారినా.. వివిధ కోణాల్లో అందుతున్న సమాచారాన్ని విశ్లేషిస్తే.. బోర్డు పెద్దలందరూ కోహ్లీకి మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని తేలింది.
ఇప్పుడు వీళ్లకు సచిన్ కూడా జతకలిశాడు. ఇంతకుముందే విరాట్ కోహ్లీ కూడా తన అభిప్రాయాన్ని సచిన్‌తో స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. జట్టులోని సీనియర్ ఆటగాళ్లు కూడా శాస్త్రి వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో కోచ్ పదవికి రవిశాస్త్రి ఫేవరెట్‌గా నిలిచాడు.