
ఢాకా: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి డాట్ బాల్ వస్తే వెంటనే స్లెడ్జ్ చేస్తాడు అని బంగ్లాదేశ్ బౌలర్ అల్ అమిన్ హొస్సెన్ ఆరోపించాడు. బౌలర్‌పై మానసిక ఒత్తిడి పెంచాలని కోహ్లీ ప్రయత్నిస్తాడన్నాడు. క్రిస్ గేల్, రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్, ఎంఎస్ ధోనీ, జో రూట్ వంటి చాలామంది గొప్ప బ్యాట్స్‌మెన్లకు తాను బౌలింగ్ చేశానని కానీ, కోహ్లీ వారిలా కాదన్నాడు. బంగ్లాదేశ్ తరఫున అమిన్ 7 టెస్టులు, 15 వన్డేలు, 31 టీ20లు ఆడాడు.
బంగ్లాదేశ్ వెబ్‌సైట్ క్రిక్‌ఫ్రెంజీ లైవ్ ఛాట్‌లో పాల్గొన్న అల్ అమిన్.. విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'మన బౌలింగ్‌లో కోహ్లీకి డాట్ బాల్ వస్తే.. అతను వెంటనే స్లెడ్జ్ చేస్తాడు. అతను నేను చెప్పలేని తప్పుడు పదాలతో దూషిస్తాడు. బౌలర్‌పై మానసిక ఒత్తిడి పెంచాలని కోహ్లీ ప్రయత్నిస్తాడు. నేను గేల్, రోహిత్, శిఖర్, స్మిత్, ధోనీ వంటి గొప్ప బ్యాట్స్‌మెన్లకు బౌలింగ్ చేశాను. కానీ వాళ్లు ఎవరూ ఇలా ఉండరు. ఒక మంచి బంతి వేసినప్పుడు వాళ్లు మర్యాదగా డిఫెండ్ చేస్తారు. కోహ్లీ అలా కాదు.. బౌలర్‌తో స్లెడ్జింగ్ చేస్తాడు' అని అమిన్ అన్నాడు.

ఇటీవలే మరో బంగ్లాదేశ్ బౌలర్ రుబెల్ హోస్సెన్ కూడా కోహ్లీపై ఇటువంటి వ్యాఖ్యలే చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో రూబెల్ బౌలింగ్‌లో కోహ్లీ ఔటయ్యాడు. దాంతో హుస్సేన్ తన సెలబ్రేషన్స్ భిన్నంగా చేసుకుంటూ కోహ్లీకి సెండాఫ్ సంకేతాలు చూపించాడు. ఇలా తన సెండాఫ్ చెప్పడానికి వారి మధ్య కలిసి పెరుగుతూ వస్తున్న వైరమే కారణమనే విషయాన్ని రూబెల్ చెప్పకనే చెప్పేశాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాతో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా తనతో కోహ్లీ వాగ్వాదానికి దిగిన విషయాన్ని రూబెల్ ప్రస్తావించాడు.
'కోహ్లీ, నేను అండర్-19 ప్రపంచకప్ నుంచి పోటీపడుతున్నాం. ఆ టోర్నీ నుంచి మా ఇద్దరి మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. అతడు అప్పట్లోనే దూకుడుగా ఉండేవాడు. తరచు ఎక్కువగా మమ్మల్ని స్లెడ్జ్ చేసేవాడు. అది అలవాటుగా మారింది. మమ్మల్ని స్లెడ్జ్ చేసే క్రమంలో తిట్ల దండకం కూడా అందుకునే వాడు. అలా మా మధ్య వైరం కొనసాగుతూ వస్తుంది. మేమిద్దరం నోటికి పని చెప్పామంటే కచ్చితంగా అంపైర్లు కలగజేసుకుని సర్దిచెప్పాల్సింది. కానీ ఇప్పుడు టీమిండియాకి ఆడే సమయంలో మాత్రం కోహ్లీ కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. భారత కెప్టెన్ స్లెడ్జింగ్‌లో ఏ స్థాయికి వెళ్లగలడో మన అందరికీ తెలుసు' అని రుబెల్ వెల్లడించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కొత్తలో కొన్నిసార్లు మైదానంలో హద్దులు దాటిన విరాట్ కోహ్లీ.. కెప్టెన్‌గా మారిన తర్వాత మాత్రం క్రమశిక్షణతో మెలుగుతున్నాడు. ధోనీ నుంచి చాలా నేర్చుకున్నాడు. అయితే ప్రత్యర్థి ఏమాత్రం కవ్వించినా.. కోహ్లీ అదే రీతిలో బదులిచ్చేందుకు వెనుకాడటం లేదు. అది నోటితోనా బ్యాట్‌తోనా అనేది మ్యాచ్, ప్రత్యర్థి వ్యవహార శైలిపై ఆధారపడి ఉంటుంది.