
హైదరాబాద్: కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి చెలరేగిపోయాడు. తొలి ఓవర్ ఆఖరి బంతికి రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒకవైపు వికెట్ కాపాడుకుంటూనే ఓపెనర్ ధావన్‌తో కలిసి స్కోర్‌బోర్డుని పరుగులు పెట్టించాడు.
ధావన్‌తో 140 పరుగుల భారీ భాగస్వామ్యాం నమోదు చేశాడు. ఈ క్రమంలో మూడో వన్డేలో సైతం 119 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో తన కెరీర్‌లో 34వ సెంచరీ నమోదు చేశాడు. తాజా సెంచరీతో విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.
గతంలో 11 సెంచరీలతో మాజీ కెప్టెన్ గంగూలీ పేరిట ఉన్న ఈ రికార్డును 12 సెంచరీలతో విరాట్ కోహ్లీ అధిగమించాడు. అంతేకాదు 11 సెంచరీలు చేసేందుకు గంగూలీ 142 ఇన్నింగ్స్ తీసుకోగా కోహ్లీ మాత్రం కేవలం 43 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించడం విశేషం. అయితే ఈ సెంచరీ కోహ్లీ కెరీర్‌లోనే అత్యధిక బంతుల్లో చేసిన సెంచరీగా నిలిచింది.
దీంతో పాటు కోహ్లీ మరో రికార్డుని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సెంచరీతో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. 54 సెంచరీలతో ఇప్పటి వరకు ఆమ్లా( దక్షిణాఫ్రికా), జయవర్ధనే(శ్రీలంక)లతో నిలిచిన కోహ్లీ తాజా సెంచరీతో వారిని వెనక్కి నెట్టాడు.
వన్డేల్లో 34, టెస్టుల్లో 21 సెంచరీలతో కలపి కోహ్లి మొత్తం 55 సెంచరీలు చేశాడు. ఇక తొలి స్థానంలో సచిన్ టెండూల్కర్(100) ఉండగా రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా) 71, కుమార సంగక్కర (శ్రీలంక) 63, కల్లిస్ (దక్షిణాఫ్రికా) 62 సెంచరీలతో కోహ్లీ కన్నా ముందంజలో ఉన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.