హైదరాబాద్: ఈ ఏడాది ఏప్రిల్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు జట్టు సభ్యులు సంతకాలు చేసిన జెర్సీని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి కానుకగా అందజేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ జెర్సీని షాహిద్ అఫ్రిది వేలం నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే... అఫ్రిది 'ఎస్‌ఏ ఫౌండేషన్' పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం(జులై 30) లండన్‌లో ప్రత్యేక విందు కార్యక్రమం ఏర్పాటు చేసి తన దగ్గర ఉన్న కోహ్లీ జెర్సీని వేలం పాట ఉంచాడు. వేలంలో కోహ్లీ జెర్సీ 4,300 యూరోలకు(సుమారు రూ.3,25,740) అమ్ముడుపోయింది.

అంతేకాదు గతంలో తనకు కానుకగా ఇచ్చిన పలువురి జెర్సీలను సైతం అఫ్రిది వేలంలో ఉంచాడు. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బుని తన ఫౌండేషన్ ద్వారా చిన్నారుల విద్య కోసం వినియోగించనున్నట్లు అఫ్రిది తెలిపాడు. 2016లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ.. అఫ్రిదికి తన జెర్సీని కానుకగా అందజేశాడు.

ఈ జెర్సీపై "షాహిద్ భాయ్.. కంగ్రాట్స్! మైదానంలో నీతో పోరు ఎప్పటికీ ప్రత్యేకమే" అంటూ రాశాడు కోహ్లీ. టోర్నీలో భాగంగా గ్రూప్ స్టేజ్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ అనంతరం కోహ్లీ జెర్సీపై భారత ఆటగాళ్లు కోహ్లీ, యువరాజ్, నెహ్రా, బుమ్రా, రైనా, పవన్ నేగి, సమి, జడేజా, భువనేశ్వర్, రహానె, ధావన్, అశ్విన్, పాండ్యా సంతకాలు చేసిన జెర్సీని అఫ్రిదికి అందజేశారు.
ఈ జెర్సీని అఫ్రిది తన కొత్త ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకుని మరీ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అఫ్రిది లండన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ క్రికెటర్లు మహ్మద్ అమిర్, ఇమాద్ వసీం కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి అఫ్రిది ఫౌండేషన్ తరఫున థార్ ఆస్పత్రికి 20 మంచాలను అందజేస్తున్నట్లు ప్రకటించారు.