ఐపీఎల్-2024లో ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లు ఖరారయ్యాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తదుపరి దశకు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో తొలి, నాలుగో స్థానాల్లో కేకేఆర్, ఆర్సీబీ ఫిక్స్ అయ్యాయి. రెండో స్థానం కోసం రాజస్థాన్, హైదరాబాద్ పోటీ పడుతున్నాయి.
అయితే ప్లేఆఫ్స్ బెర్త్ కోసం చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగిన ఆర్సీబీ-సీఎస్కే మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్ వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 27 పరుగుల తేడాతో నెగ్గింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ టాప్-4లో నిలవడానికి ఆర్సీబీపై తప్పక గెలవాల్సిన అవసరం లేకపోయింది. 17 లేదా అంతకంటే తక్కువ పరుగులతో ఓడినా చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరేది. కానీ ఆర్సీబీ ఆల్‌రౌండ్ షోతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. డుప్లెసిస్ (54; 39 బంతుల్లో, 3X4, 3X6) టాప్ స్కోరర్. విరాట్ కోహ్లి (47; 29 బంతుల్లో, 3X4, 4X6), రజత్ పటిదార్ (41; 23 బంతుల్లో, 2X4, 4X6), కామెరూన్ గ్రీన్ (38*; 17 బంతుల్లో, 3X4, 3X6) సత్తాచాటారు. మిచెల్ శాంట్నర్ (1/23) పొదుపుగా బౌలింగ్ చేశాడు.
అనంతరం ఛేదనలో సీఎస్కే 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితమైంది. రచిన్ రవీంద్ర (61; 37 బంతుల్లో, 5X4, 3X6), రవీంద్ర జడేజా (42; 22 బంతుల్లో, 3X4, 3X6), ఎంఎస్ ధోనీ (25; 13 బంతుల్లో, 3X4, 1X6) పోరాడారు.ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కావాలంటే సీఎస్కేకు చివరి ఆరు బంతుల్లో 17 పరుగులు అవసరమయ్యాయి. యశ్ దయాల్ వేసిన తొలి బంతిని ధోనీ స్టేడియం బయటకు పంపించాడు. కానీ యశ్ ఆ తర్వాత అద్భుతంగా బౌలింగ్ చేసి ఆఖరి అయిదు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి జట్టును గెలిపించాడు.
విజయానంతరం ఆర్సీబీ నినాదాలతో స్టేడియం మార్మోగింది. బెంగళూరు ఆటగాళ్లంతా సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి భావోద్వేగానికి గురయ్యాడు. అతని కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయి. ఈ సీజన్‌లో ఓ దశలో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ చివరి ఆరు మ్యాచ్‌ల్లో వరుసగా గెలిచి టాప్-4లో నిలిచింది. దీంతో కోహ్లి ఎమోషనల్ అయ్యాడు. మరోవైపు జట్టును గెలిపించలేకపోయాననే బాధతో ధోనీ మౌనంగా ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.