
హైదరాబాద్: రోడ్డుపై చెత్తను పడేసిన ఓ వ్యక్తిని అనుష్క అక్కడే కడిగిపారేసిన వీడియోను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. వీడియోలో కారు విండో కిందకి దించి, ఎందుకు చెత్త అలా రోడ్డుపై పాడేసారని లగ్జరీ కారులో వెనుక సీటులో కూర్చున్న వ్యక్తిని అనుష్క ప్రశ్నించారు.
"రోడ్డుపై చెత్త వేసేటప్పుడు కాస్త ఆలోచించండి. తర్వాత నుంచి చెత్త డబ్బాను వాడండి" అని అనుష్క సున్నితంగా అతడిలో మాట్లాడింది. అయితే, ఆ వ్యక్తి అనుష్క మాటలను ఏ మాత్రం లెక్క చేయకుండా.. ధీమాగా ఉండటంతో పాటు తాను చేసిన తప్పును ఒప్పుకోకపోయే సరికి, అనుష్క కోపంతో ఊగిపోయింది.
ఈ సన్నివేశాన్ని కారులో అనుష్క పక్కనే కూర్చున్న విరాట్ కోహ్లీ వీడియో తీశారు. "చూడండి... ఈ వ్యక్తులు రోడ్డు మీదే చెత్తను విసిరివేశారు. లగ్జరీ కారులో ప్రయాణించే వారికి, మెదడు పోయినట్టుంది. ఇలాంటి వ్యక్తులు మన దేశాన్ని శుభ్రం చేస్తారా? అవును నిజం! ఇలాంటి వాటిని కనుక మీరు చూస్తే, వెంటనే ఇదే విధంగా చేయండి. అవగాహనను కల్పించండి" అని పేర్కొంటూ కోహలీ వీడియోను షేర్ చేశాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు కోహ్లీకి ఆయన భార్య అనుష్క శర్మకు మద్దతుగా నిలుస్తూ ట్వీట్లు చేయగా, మరికొందరు మాత్రం జోకులు వేశారు. ఈ జోకులపై కోహ్లీ గట్టిగానే స్పందించాడు. 'ఇలా చేయడానికి చాలా మందికి ధైర్యం ఉండదు. అందుకే దీన్ని ఫన్నీగా తీసుకుంటున్నారు. ఇటీవల చాలామందికి మిమి కంటెంట్ కావాలి. ఇది చాలా అవమానకరం' అని మరో ట్వీట్ చేశారు.