హైదరాబాద్: గత కొన్నాళ్లుగా తన అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియాకు కెప్టెన్ కోహ్లీ వరుస విజయాలనందిస్తున్నాడు. కేవలం కెప్టెన్‌గా జట్టుని నడిపించడమే కాకుండా కీలక సమయాల్లో ఆదుకుంటూ జట్టులోని మిగిలిన సభ్యుల్లో కూడా కోహ్లీ స్ఫూర్తిని నింపుతున్నాడు.
అద్భుత విజయానందిస్తున్న కోహ్లీ విజయ రహస్యం గురించి క్రీడా విశ్లేషకులు, అభిమానులు అనేక ఊహాగానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. కోహ్లీకి విజయం అంటేనే ఇష్టం అని కొందరు క్రీడా విశ్లేషకులు చెప్పడం గతంలో మనం చూసాం. కోహ్లీకి సెంచరీలు చేయడం, రికార్డులు సాధించడం ఇష్టం అని మరి కొందరు అంటుంటారు.
అయితే తన విజయానికి అసలు కారణం వేరే ఉందని కోహ్లీ చెప్పకనే చెప్పాడు. దీనికి సంబంధించి కోహ్లి తాజాగా ఓ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశాడు. తనకు నచ్చిన పుస్తకం ఇదేనంటూ పరమహంస యోగానంద రచించిన 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి'(ఓ యోగి ఆత్మకథ)ని అభిమానులతో పంచుకున్నాడు.
పరమహంస యోగానంద రచించిన 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి'(ఓ యోగి ఆత్మకథ)ని కోహ్లీకి ఇష్టమైన పుస్తకమని, అది చదివితే మన ఆలోచనలు, భావాలు మారి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే ధైర్యం వస్తుందని అంటున్నాడు. వీలైతే మీరు చదవండి, మీలో కూడా మార్పు వస్తుందని సలహా కూడా ఇస్తున్నాడు.
'ఈ పుస్తకం అంటే నాకు ఇష్టం. ధైర్యం లేనివాళ్లందరూ కచ్చితంగా చదవితే వారి ఆలోచనలు, భావాలూ సవాళ్లను ఎదుర్కొనేలా మారతాయి' అంటూ కోహ్లీ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. కాగా, భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 23న తొలి టెస్టు ప్రారంభం కానుంది.