ఆసీస్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చాలా మంది మాజీలు, ఫ్యాన్స్ అందరూ టీమిండియాను తిట్టిపోస్తున్నారు. అసలు సిసలు మ్యాచుల్లో చేతులెత్తేయడం భారత జట్టుకు అలవాటైపోయిందని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీపై కూడా విమర్శలు వస్తున్నాయి. అతను అవుటైన విధానాన్ని అందరూ తప్పుబడుతున్నారు.
జట్టు చాలా కష్టాల్లో ఉండగా ఆఫ్‌స్టంప్ ఆవల పడిన బంతిని ఆడబోయిన కోహ్లీ పెవిలియన్ చేరాడు. దీనిపై సునీల్ గవాస్కర్, వసీం జాఫర్ వంటి మాజీలతోపాటు చాలా మంది ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు. ఇలాంటి సమయంలో ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడే కోహ్లీ తన ఇన్‌స్టాగ్రాంలో కొన్ని క్రిప్టిక్ పోస్టులు పెట్టడం మొదలు పెట్టాడు.

మ్యాచ్ నాలుగో రోజు ముగిసిన తర్వాత ఒక్కోసారి అన్నీ వదిలేయడం కూడా నేర్చుకోవాలంటూ హితబోధ చేశాడు. ఇప్పుడు మరోసారి అలాంటి ఒక కొటేషన్‌ను షేర్ చేశాడు. దీనిలో మార్పు గురించి ప్రస్తావించే కొటేషన్‌ను కోహ్లీ పోస్టు చేశాడు. 'మార్పును సరిగా అర్థం చేసుకోవాలంటే.. దానిలో దూకాలి, దాంతోపాటు నడవాలి చివరకు ఆ మార్పుతో కలిసి డ్యాన్స్ చేయాలి' అనే అలన్ వాట్స్ కొటేషన్‌ను కోహ్లీ పంచుకున్నాడు.
ఇలా కోహ్లీ ఎందుకు కొటేషన్లు షేర్ చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం అతన్ని ఎగతాళి చేస్తున్నారు. కీలకమైన మ్యాచుల్లో క్రికెట్ ఆడలేడు కానీ.. ఇలా సాధువులా నీతులు చెప్తాడని తిడుతున్నారు. ఏదేమైనా కోహ్లీ ఇలా క్రిప్టిక్ పోస్టులు పెట్టడం వెనుక ఏదో జరిగే ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. జట్టులో ఏదో జరగడం వల్లనే అతను ఇలా చేస్తున్నాడని ఫీల్ అవుతున్నారు.
ఇక డబ్ల్యూటీసీ ఓటమి తర్వాత భారత జట్టుకు నెలరోజుల విశ్రాంతి లభించింది. జూన్ నెలలో ఆఫ్ఘన్‌తో సిరీస్ పెట్టాలని అనుకున్నా.. కొన్ని అనుకోని కారణాల వల్ల అది ఆగిపోయింది. దీంతో జులైలో జరిగే వెస్టిండీస్ సిరీస్‌తోనే భారత జట్టు మళ్లీ మైదానంలో దిగుతుంది. అప్పటి వరకు కోహ్లీ కూడా తన కుటుంబంతో కలిసి టైం ఎంజాయ్ చేస్తున్నాడు.